ఈడ్చిపారేసేందుకు కదిలిన బలగాలు
చండీగఢ్: ఉద్యమాల సమయంలో మోహరించాల్సిన బలగాలు ఉద్యమం తగ్గుముఖంపట్టాక మోహరిస్తే ఎలా ఉంటుంది. ప్రస్తుతం హర్యానాలో అదే జరుగుతుంది. అయితే, అదేదో ఆందోళన చర్యలు అదుపుచేసేందుకు కాదు.. ఆందోళనకారులు పోగేసిన బారీకేడ్స్, చెత్తా చెదారం తీసి పక్కకు పడేసేందుకు. అవును.. రిజర్వేషన్ల కోసం జాట్ లు చేస్తున్న ఆందోళన నేటికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. హింసను సృష్టించిన ఈ ఉద్యమం కేంద్ర ప్రభుత్వ హామీతో కాస్తంత నెమ్మదించింది.
పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధరణ స్థితికి వస్తున్నాయి. ఈ ఉద్యమ సమయంలో వారు రహదారులు, రైల్వే స్టేషన్లు, ట్రాక్లకు ఎక్కడికక్కడ అవరోధాలు సృష్టించారు. కొత్త, పాత అని తేడా లేకుండా పలు వాహనాల వాటిపై నిలిపారు. ఎక్కడికక్కడా బారీకేడ్లు పెట్టి రవాణా స్తంభించిపోయేలా చేశారు. రాళ్లు రప్పలు కూడా కుప్పలుగా పోశారు. అయితే, వాటిని తొలగించే సాహసం కేంద్ర ప్రభుత్వ బలగాలు చేయలేదు. అందులో జోక్యం చేసుకుంటే ఎక్కడ ఆందోళన మరింత హింసాత్మకం అవుతుందనే కారణంతో కనీసం వాటిపై చేయి కూడా వేయలేదు.
ప్రస్తుతం వారు వెనక్కి తగ్గడంతో ఆ బారీ కేడ్స్ ను తొలగించేందుకు బలగాలన్నీ ఇప్పుడు హర్యానాలో దండిగా మోహరించాయి. గడిచిన పన్నెండు గంటల్లో ఎక్కడా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. ఇప్పటివరకు, పదకొండు మంది ఈ ఉద్యమం కారణంగా ప్రాణాలు కోల్పోగా.. 150మంది గాయాలపాలయ్యారు. ఉద్యమ సమయంలో ఎన్హెచ్-10(న్యూఢిల్లీ-అంబాలా), ఎన్హెచ్-10(న్యూఢిల్లీ-హిసార్) రహదారులపై ఢిల్లీ అంబాలా, ఢిల్లీ-భటిండాల మధ్య నడిచే రైళ్ల ట్రాక్లపై ఉన్న అవరోధాలు కూడా తొలగిస్తున్నారు. ఇక సోనిపట్, పానిపట్ జిల్లాలో బారీకేడ్లను తీసివేయడంతోపాటు హర్యానా-పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, చండీగఢ్ ల మధ్య తెగిపోయిన రోడ్డు మార్గాలను పునరుద్ధరిస్తున్నారు. ఈఉద్యమం కారణంగా దాదాపు 800 మంది రైళ్లను రద్దు చేసిన అధికారులు తిరిగి వాటిని ప్రారంభించే యోచనలుచేస్తున్నారు.