అమ్మ’కు, ‘అక్క’కు మళ్లీ పట్టం | Jayalalita, Mamata benarjee win in assembly elections | Sakshi
Sakshi News home page

అమ్మ’కు, ‘అక్క’కు మళ్లీ పట్టం

Published Fri, May 20 2016 2:45 AM | Last Updated on Mon, Dec 3 2018 1:54 PM

అమ్మ’కు, ‘అక్క’కు మళ్లీ పట్టం - Sakshi

అమ్మ’కు, ‘అక్క’కు మళ్లీ పట్టం

తమిళనాట ‘జయ’ం.. పశ్చిమ బెంగాల్‌లో మమత విజయ దుందుభి
రెండు రాష్ట్రాలు కోల్పోయి తిరోగమనంలో కాంగ్రెస్
పుదుచ్చేరిలో కాస్త ఊరట.. కాంగ్రెస్-డీఎంకేలకు అధికారం
కేరళలో కామ్రేడ్స్ పునరాగమనం.. బెంగాల్‌లో భంగపాటు
2 చోట్ల అధికార పార్టీల గెలుపు.. 3 చోట్ల మారిన ప్రభుత్వాలు  
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల చేసిన ఈసీ

 
ఈశాన్య భారతంలో తొలిసారి కమలం వికసించింది. అస్సాంలో అధికారాన్ని సొంతం చేసుకుని బీజేపీ కొత్త చరిత్ర సృష్టించింది. ఢిల్లీ, బిహార్ ఎన్నికల్లో వరుస పరాజయాలతో నీరసించి ఉన్న కమలదళానికి ఈ గెలుపు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. అదే అస్సాంలో పదిహేనేళ్ల అధికారాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. దానితో పాటు కేరళలోనూ పరాజయం పాలై మరింతగా కుదేలైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి మొదలు గెలుపు మాట ఎరుగని హస్తానికి.. గుడ్డిలో మెల్లగా పుదుచ్చేరిలో గెలుపు లభించి కాస్త ఊరటనిచ్చింది. అక్కడ అధికార ఎన్‌ఆర్‌కాంగ్రెస్ ఓటమి మూటగట్టుకుంది. కేరళలో కాంగ్రెస్ కూటమిని గద్దె దించి.. వామపక్షాల సారథ్యంలోని లెఫ్ట్
 డెమొక్రటిక్ ఫ్రంట్ ఐదేళ్ల విరామం తర్వాత అధికారంలోకి వచ్చింది.
 
 అయితే.. అవే వామపక్షాలు ఐదేళ్ల కిందట అధికారం కోల్పోయిన పశ్చిమబెంగాల్‌లో ఈసారి కాంగ్రెస్‌తో జట్టు కట్టి ఉమ్మడిగా పోరాడినా ఫలితం లేకపోయింది. మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ వంగభూమిలో వరుసగా రెండోసారి అధికారంలోకి రావటం ద్వారా రాష్ట్రంపై తన పట్టును మరింతగా బిగించింది. ఇక తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే కూడా వరుసగా రెండోసారి గెలిచి రికార్డు సృష్టించింది. తమిళనాట ఈసారీ అధికారం చేతులు మారుతుందని.. తమిళులు ‘అమ్మ’ని కాదని డీఎంకేపై ‘కరుణ’ చూపుతారని చెప్పిన ఎగ్జిట్‌పోల్స్ సర్వే తప్పని తేలింది. అయితే.. మిగతా నాలుగు రాష్ట్రాల విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవటం విశేషం!
 
న్యూఢిల్లీ: ఈశాన్యంలోని అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు, దక్షిణాదిన కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం శాసనసభలకు ఎన్నికల ప్రక్రియ ఈ నెల 16వ తేదీన ముగిసినవిషయం తెలిసిందే. 5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం సాయంత్రానికి కల్లా దాదాపు పూర్తి ఫలితాలను కూడా వెల్లడించింది. మొత్తం 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో 2 ప్రధాన రాష్ట్రాల్లో ఓటర్లు అధికార పార్టీలకే పగ్గాలు అప్పంగించారు. అవి రెండూ ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు కావటం విశేషం. మరో 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ఓడించారు. ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కాంగ్రెస్‌ను ఓడించి బీజేపీని గెలిపించిన ఓటర్లు.. దక్షిణాది రాష్ట్రం కేరళలో కాంగ్రెస్‌ను గద్దె దించి వామపక్షాలకు అధికారం అప్పగించారు. అదే సమయంలో పుదుచ్చేరిలో ప్రాంతీయ పార్టీని కాదని కాంగ్రెస్‌ను గెలిపించారు. ఆ ఎన్నికల ఫలితాలివీ...
 
 కేరళలో మళ్లీ కమ్యూనిస్టులకు పగ్గాలు...
 కేరళ ఓటర్లు ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చేసే తమ సంప్రదాయాన్ని తూచా తప్పకుండా మళ్లీ పాటించారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ సర్కారును గద్దె దించి సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌కు అధికార పగ్గాలు అప్పగించారు. మొత్తం 140 అసెంబ్లీ సీట్లలో ఎల్‌డీఎఫ్ సునాయాసంగా 91 సీట్లు (ఆరుగురు స్వతంత్రులతో కలిపి) గెలుచుకుంది. 2011 ఎన్నికల్లో ఈ కూటమికి 67 సీట్లు లభించాయి. నాటి ఎన్నికల్లో 70 సీట్లు గెలుచుకున్న యూడీఎఫ్ ఇప్పుడు 47 సీట్లకు దిగజారి అధికారం కోల్పోయింది. నాడు 38 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు 22 సీట్లకే పరిమితమైంది. ఇక.. కమలదళం నాలుగు దశాబ్దాలుగా ఎన్నికల పోరాటం చేస్తున్న కేరళలో తొలిసారి ఖాతా తెరవటం ద్వారా బీజేపీ మరో చరిత్ర లిఖించింది. ఆ పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి ఒ.రాజగోపాల్ నెమామ్ నియోజకవర్గంలో సీపీఎం సిటింగ్ ఎమ్మెల్యేపై విజయబావుటా ఎగురవేశారు.
 
 పుదుచ్చేరిలో కాంగ్రెస్‌కు ఊరట...
 అటు అస్సాంలో ఇటు కేరళలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్, ఆ పార్టీతో జట్టు కట్టి తమిళనాడులో మరోసారి పోరాడి ఓడిన డీఎంకే - ఈ 2 పార్టీల కూటమిని పుదుచ్చేరి ఓటర్లు గెలిపించి వాటికి కాస్తంత ఊరటనిచ్చారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతపు అసెంబ్లీలో 30 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ - డీఎంకే కూటమి 17 సీట్లు గెలుచుకుని అధికారం కైవసం చేసుకుంది. పార్టీ నుంచి వేరుపడి ఏఐఎన్‌ఆర్‌సీని స్థాపించి గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఎన్.రంగసామిని కాంగ్రెస్ ఇప్పుడు ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. గత ఎన్నికల్లో 7 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ ఇప్పు డు 15 సీట్లను గెలుచుకోగా.. మిత్రపక్షం డీఎంకే మరో 2 స్థానాలను సొంతం చేసుకుంది. నాటి ఎన్నికల్లో 15 స్థానాలు గెలుపొందిన ఏఐఎన్‌ఆర్‌సీ ఇప్పుడు ఎనిమిది స్థానాలకు పరిమితమైంది. ఒంటరిగా పోటీ చేసిన అన్నా డీఎంకే నాలుగు సీట్లలో గెలుపొందగా.. ఇతరులు మరొక సీటు గెలుచుకున్నారు.
 
 ఈశాన్యంలో కమల వికాసం...
 అస్సాంలో తరుణ్‌గొగోయ్ సారథ్యంలో 2011 ఎన్నికల్లో మూడోసారి గెలిచిన కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ పాలనకు బీజేపీ ముగింపు పలికింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి దూసుకొచ్చిన కాషాయదళం ఈశాన్య భారతంలోని ఒకరాష్ట్రంలో తొలిసారి విజయబావుటా ఎగురవేసింది. కేంద్రమంత్రి శర్బానంద సోనేవాల్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు నిలిపిన బీజేపీ.. దాని మిత్రపక్షాలైన ఏజీపీ, బోడో పీపుల్స్ ఫ్రంట్‌లు భారీ విజయం సాధించాయి.
 
 మొత్తం 126 సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ కూటమి 86 సీట్లు గెలుచుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు స్థానాలకు పరిమితమైన బీజేపీ ఇప్పుడు ఏకంగా 60 సీట్లను గెలుచుకోవటం అతి పెద్ద సంచలనం. మిత్రపక్షాల్లో ఏజీపీ 14 సీట్లు, బోడో పీపుల్స్ ఫ్రంట్ 12 సీట్లు చొప్పున గెలుపొందాయి. ఇక గత ఎన్నికల్లో 78 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ బలం ఇప్పుడు కేవలం 26 స్థానాలకు పడిపోయింది. ఏయూడీఎఫ్ 13 స్థానాలు, ఇతరులు మరొక స్థానం గెలుచుకున్నారు.
 
తమిళనాడులో రెండోసారీ జయభేరి...
ఇక 32 ఏళ్లుగా కొనసాగిన ఐదేళ్లకోసారి ‘అధికార మార్పిడి’ సంప్రదాయానికి తమిళనాడు ఓటర్లు ఈసారి స్వస్తి పలికారు. ‘అమ్మ’ జయలలిత నేతృత్వంలోని అధికార అన్నా డీఎంకేకే మళ్లీ అధికారం అప్పగించారు. అయితే.. డీఎంకే, కాంగ్రెస్ కూటమి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న అన్నా డీఎంకే బలం ఈసారి కొంత తగ్గింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలకు గాను 232 స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. 2011 ఎన్నికల్లో 149 సీట్లను గెలుచుకున్న అధికార పార్టీ ఈసారి 133 స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని నిలబెట్టుకుంది. తమిళ ఓటర్లు అధికార పార్టీని మళ్లీ గెలిపించటం 1984 తర్వాత ఇదే తొలిసారి.
 
 రాష్ట్రంలో ఈసారి కూడా అధికార మార్పిడి జరుగుతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పయ్యాయి. మరోవైపు.. 91 ఏళ్ల కరుణానిధి సారథ్యంలోని ప్రతిపక్ష డీఎంకే ఈసారి భారీగానే బలం పుంజుకుంది. గత ఎన్నికల్లో కేవలం 22 సీట్లు పొందిన డీఎంకే ఇప్పుడు 90 సీట్లు గెలవటం విశేషం. గత ఎన్నికల్లో ఐదు సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ బలం కూడా ఇప్పుడు 8కి పెరిగింది. ఇక.. హోరాహోరీ పోరులో హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్ అవుతారని అంచనాలున్న విజయ్‌కాంత్ సారథ్యంలోని డీఎండీకే పూర్తిగా నేలకరిచింది. గత ఎన్నికల్లో అన్నా డీఎంకేతో దోస్తీ కట్టి గెలుచుకున్న 48 సీట్లను కూడా కోల్పోయి సున్నా చుట్టింది. డీఎండీకే, వైకో నేతృత్వంలోని ఎండీఎంకే, జీకే వాసన్‌కు చెందిన టీఎంసీ, వామపక్షాలు కలిపి మూడో కూటమిగా ప్రభావం చూపగలరన్న అంచనాలు పూర్తిగా తల్లకిందులయ్యాయి. వీటిలో ఏ ఒక్క పార్టీ కూడా ఒక్క సీటూ గెలవలేకపోగా.. ఉన్న సీట్లనూ కోల్పోయాయి.
 
 బెంగాల్‌లో మరోసారి మమతానురాగం..
 పశ్చిమబెంగాల్‌లో ఒంటరిగా బరిలోకి దిగిన తృణమూల్ కాంగ్రెస్.. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సారథ్యంలో మరోసారి అద్భుత విజయం సాధించింది. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసినా ఆ కూటమిని మట్టికరిపిస్తూ.. 294 శాసనసభ స్థానాల్లో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించింది. 2011 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసిన తృణమూల్ 184 సీట్లు గెలుచుకోగా.. ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసి ఏకంగా 211 స్థానాలను కైవసం చేసుకుంది.
 
 గత ఎన్నికల్లో 42 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ ఇప్పుడు రెండు సీట్లు అదనంగా 44 గెలుచుకుంది. నాడు 61 సీట్లకే పరిమితమై.. మూడున్నర దశాబ్దాల అధికారాన్ని కోల్పోయిన వామపక్ష కూటమి పరిస్థితి ఈ ఎన్నికల్లో మరింతగా దిగజారింది. ఈసారి ఇంకో 28 స్థానాలు కోల్పోయి 33 సీట్లకు పడిపోయింది. గత ఎన్నికల్లో 40 సీట్లుగా ఉన్న సీపీఎం బలం 26 సీట్లకు తగ్గిపోయింది. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ మూడు సీట్లు గెలుచుకుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement