ఒంటరులే.. విజేతలు!!
నేను సింగిల్.. అవుదాం మింగిల్ అనుకుంటూ పాటలు పాడేస్తున్నారా? కాసేపు ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టండి. సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను ఓసారి విశ్లేషించి చూసుకుంటే, ఇప్పుడు కాదు కదా, భవిష్యత్తులో కూడా పెళ్లికెందుకు తొందర అని మీరు అనుకోక తప్పదు. కొత్త ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తమిళనాడు సీఎం పురుచ్చితలైవి జయలలిత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. వీళ్లంతా ఈ ఎన్నికల్లో అద్భుతమైన విజయాలు సాధించిన వాళ్లే. మరో పోలిక ఏమిటంటే.. వీళ్లంతా ఒంటరులే.
కొత్త ప్రధాని నరేంద్రమోడీకి పెళ్లయినా కూడా చాలాకాలంగా ఆయన బ్రహ్మచర్యాన్నే పాటిస్తున్న విషయం ఇప్పుడు బహిరంగ రహస్యం. దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి, రోజుకు ఐదారు బహిరంగం సభల్లో పాల్గొని, ఎన్నికల వ్యూహాలు రూపొందించి.. ఒకరకంగా ఒంటిచేత్తో బీజేపీకి ఎవరితోనూ కూటమి కట్టాల్సిన అవసరం లేకుండానే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినంత మెజారిటీ అందించారు.
ఒడిషాలో బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఘోటక బ్రహ్మచారి. దేశమంతా నరేంద్రమోడీ గాలి వీస్తున్నా.. దానికి ఎదురొడ్డి నిలిచి గెలిచిన విజేత ఈయన. లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి జరిగిన ఒడిషాలో నవీన్ సారథ్యంలోని బీజేడీ విజయదుందుభి మోగించింది. మొత్తం 147 సీట్లున్న అసెంబ్లీలో ఏకంగా 115 స్థానాలు కైవసం చేసుకుంది. అలాగే మొత్తం 21 లోక్సభ స్థానాలకు గాను 20 స్థానాలు గెలుచుకుంది.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా బ్రహ్మచారిణే. రాష్ట్రంలో తన ప్రాభవాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ఇక్కడ మొత్తం 39 లోక్సభ స్థానాలు ఉండగా, ప్రతిపక్ష డీఎంకేకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకంగా 37 సీట్లు ఎగరేసుకుపోయారు. మిగిలిన రెండింటిలో కూడా ఒకచోట బీజేపీ, మరోచోట పీఎంకే గెలిచాయి. 2009 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే 18 స్థానాలు గెలుచుకున్నా.. ఈసారి ఆ పార్టీని జయయలిత అథఃపాతాళానికి తొక్కేశారు.
శారదా చిట్ఫండ్ స్కాంతో ప్రతిష్ఠ మసకబారినా.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మూడేళ్లు దాటినా, ప్రభుత్వంపైన.. సీఎం పైన వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినా కూడా మమతా బెనర్జీ తన దమ్మేంటో చూపించారు. వామపక్షాల దుమ్ము దులిపేశారు. పశ్చిమబెంగాల్లో మొత్తం 42 లోక్సభ స్థానాలు ఉంటే, వాటిలో 34 సీట్లను సొంతం చేసుకున్నారు. 2009 ఎన్నికల్లో కేవలం 19 సీట్లే గెలుచుకున్నా, ఈసారి వామపక్షాల ఖాతాలోని మొత్తం 15 సీట్లనూ కొల్లగొట్టి తృణమూల్ బలాన్ని 34కు చేర్చారు. కాంగ్రెస్ ఖాతాలో ఉన్న రెండు స్థానాలను మాత్రమే లెఫ్ట్ఫ్రంట్ గెలుచుకోగలిగింది. మమతా బెనర్జీ కూడా ఘోటక బ్రహ్మచారిణే అన్న విషయం కూడా తెలిసిందే.
ఇలా.. ఈసారి ఎన్నికల్లో ఘన విజయాలు సాధించిన నలుగురూ ఒంటరి జీవితాలు గడుపుతున్నవాళ్లే. దీనిపై ఓ పరిశోధన కూడా జరిగింది. ఒంటరి జీవితం గడిపేవాళ్లకు ఎక్కువ సమయం ఉంటుందని, ఇంట్లో ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి సులభంగా పనులు చేసుకోగలరని అంటున్నారు. అలాగే ఇంట్లో ఎవరితో గొడవలు కూడా కావు కాబట్టి పని సులభంగా అవుతుందనీ చెబుతున్నారు. అందుకే.. సోలో బతుకే సో బెటరు!!