23న సీఎంగా జయ ప్రమాణం
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశానికి కొత్తగా ఎన్నికైన 133 మంది ఎమ్మెల్యేలు (జయ మినహా) హాజరై జయలలితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆరోసారి సీఎం పగ్గాలు చేపట్టనున్నారు. సమావేశానికి వెళ్లే ముందు నగరంలోని పెరియార్, అన్నాదురై, ఎంజీ రామచంద్రన్ విగ్రహాలకు జయ నివాళులర్పించారు. ఈనెల 23న గవర్నర్ కే రోశయ్య జయలలిత చేత ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చే యిస్తారు.
ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు కేంద్రమంత్రులు, సీఎంలకు ఆహ్వానాలు పంపారు. ఐదేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలను విశ్వసించి తనకు మరోసారి అధికారం ఇచ్చిన ప్రజలకు మాటలతో కాకుండా చేతలతో కృతజ్ఞత చాటుకుంటానని జయలలిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించినందుకు పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ... జయలలితకు ఫోన్‌చేసి అభినందనలు తెలిపారు. జయ కూడా మమతకు బెంగాల్లో గెలుపొందినందుకు అభినందనలు చెప్పారు. అలాగే, తనను అభినందించిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ఎల్‌కే అద్వానీలకు జయ ధన్యవాదాలు తెలిపారు.