ఆదాయం చట్టబద్ధం.. ఆస్తులూ చట్టబద్ధం...
- జయలలిత కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పు
- నిందితుల ఆదాయానికి మించి ఆస్తి 8.12 శాతం మాత్రమే ఉంది
- 10 % లోపుంటే అభియోగాల నుంచి విముక్తికి అర్హులు 20 శాతం వరకూ అదాయానికి మించిన ఆస్తిని అనుమతించదగ్గ పరిమితిగా పరిగణించవచ్చని ఆంధ్రప్రదేశ్ సర్కారు సర్క్యులర్ కూడా జారీ చేసింది
అన్ని పరిస్థితులు, రికార్డులోని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. విచారణ కోర్టు తీర్పు, నమోదు చేసిన నిర్ధారణ.. లోపభూయిష్టంగా ఉందని, చట్టం ప్రకారం నిలువజాలదని నేను భావిస్తున్నా. కృష్ణానంద్ అగ్నిహోత్రి కేసు ప్రకారం.. ఆదాయానికి మించి ఆస్తి పది శాతం లోపుగా ఉన్నట్లయితే.. నిందితులు అభియోగాల నుంచి విముక్తం కావటానికి అర్హులు. 20 శాతం వరకూ ఆదాయానికి మించి ఆస్తులను అనుమతించదగ్గ పరిమితిగా పరిగణించవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. ద్రవ్యోల్బణ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటూ.. 10 శాతం నుంచి 20 శాతం వరకూ ఆదాయానికి మించి ఆస్తులను అనుమతించదగ్గ పరిమితిగా అంగీకరించారు. ఈ కేసులో ఆదాయానికి మించి ఆస్తి సాపేక్షంగా స్వల్పంగా ఉంది. కాబట్టి.. నిందితులు నిర్దోషులుగా విడుదలకు అర్హులు. ప్రధాన నిందితురాలు (జయలలిత) నిర్దోషిగా విడుదలైనపుడు.. తక్కువ పాత్ర పోషించిన ఇతర నిందితులు కూడా నిర్దోషులుగా విడుదలకు అర్హులు.
నిర్మాణ వ్యయం, వివాహ ఖర్చులు తొలగించాలి...
(జయలలితకు చెందిన) దుస్తులు, చెప్పుల విలువ స్వల్పమైన విలువ కనుక.. డెరైక్టొరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ-కరప్షన్ ఆస్తుల నుంచి దీనిని నేను తగ్గించలేదు. నిందితుల ఆస్తులను, సంస్థలను, కంపెనీలను, నిర్మాణ వ్యయం రూ. 27,79,88,945 ను, వివాహ ఖర్చులు రూ. 6,45,04,222 ను ప్రాసిక్యూషన్ కలిపివేసింది. ఆస్తులను రూ. 66,44,73,573 గా విలువ కట్టింది. ఈ వివాహ ఖర్చులు.. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 1995లో సుధాకరన్ (జయలలిత మాజీ దత్తపుత్రుడు) వివాదాస్పద విలాసవంతమైన వివాహానికి సంబంధించినవి. అధికంగా చూపిన నిర్మాణ వ్యయాన్ని, వివాహ ఖర్చులను తొలగించినట్లయితే.. ఆస్తుల విలువ రూ. 37,59,02,466 అవుతుంది. నిందితుల, సంస్థలు, కంపెనీల మొత్తం ఆదాయం రూ. 34,76,65,654 గా ఉంది. ఆదాయానికి మించిన మొత్తం రూ. 2,82,36,812 గా ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల శాతం 8.12 గా ఉంది.
తొలి కోర్టు తీర్పును పరిశీలించే పని పై కోర్టుదే...
దోషులుగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పుపై అప్పీలులో.. ప్రాసిక్యూషన్ వాదన దృఢమైన వాస్తవమని.. దరఖాస్తుదారుల దోషిత్వం సహేతుకమైన అన్ని సందేహాలకూ అతీతంగా నిరూపితమైందని.. తొలి కోర్టు (కింది కోర్టు) నిశ్చయంగా సంతృప్తి చెందిందా లేదా అనేది చూడాల్సింది అప్పిలేట్ కోర్టు (పై కోర్టు). తొలి కోర్టు పొరపాటు అవగాహనకు వచ్చిందని అప్పిలేట్ కోర్టును సంతృప్తిపరచే పని దరఖాస్తుదారులది (అప్పీలుదారులది) కాదు. దోషులుగా నిర్ధారితులైన కొందరు వ్యక్తుల అప్పీలులో.. మొత్తం సాక్ష్యాలను పరిశీలించే అవకాశం ఈ కోర్టుకు ఉంది. ఈ విభాగం కింద విచారణ కోర్టుకు గల అధికారాలే అప్పిలేట్ కోర్టుకూ ఉంటాయి. సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత.. నిర్ధారణకు వచ్చిన అంశాలు లోపభూయిష్టమని, సాక్ష్యాలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పే స్థితిలో ఈ కోర్టు ఉన్నట్లయితే.. అలా చేయటానికి ఎటువంటి చట్టపరమైన నిషేధమూ లేదు. అంతేకాకుండా.. న్యాయ ప్రయోజనాల రీత్యా అలా చేసి తీరాలి.
విచారణ కోర్టు సాక్ష్యాలను సరైన దృష్టితో పరిశీలించలేదు...
ఈ కేసు విషయంలో.. విచారణ కోర్టు ఆదాయ పన్ను విచారణలను కనీస సాక్ష్య విలువగా విస్మరించింది. సాక్ష్యాలను సరైన దృష్టితో పరిశీలించలేదు. విచారణ కోర్టు తన తీర్పులో నిందితులు ఇండియన్ బ్యాంక్ నుంచి రుణం పొందారని ప్రస్తావించినప్పటికీ.. దానిని (ఆ రుణాన్ని) ఆదాయంగా పరిగణనలోకి తీసుకోలేదు. కాబట్టి ఆ రుణాన్ని ఆదాయంగా పరిగణనలోకి తీసుకోకపోవటం ద్వారా విచారణ కోర్టు పొరపాటు చేసింది. విలువకట్టటం కూడా.. డిఫెన్స్ (నిందితులు) దానితో విభేదించినప్పటికీ.. సంబంధిత కాలంలో నిర్మాణ వ్యయానికి సంబంధించిన సాక్ష్యాన్ని పరిశీలించటంలో విచారణ కోర్టు విఫలమైంది. రికార్డులో ఉంచిన సాక్ష్యాన్ని పరిశీలించకుండానే.. కేవలం వ్యయంలో 20 శాతం తగ్గించవచ్చన్న నిర్ధారణకు వచ్చింది. వివాహ ఖర్చుల వ్యయం రూ. 3,00,00,00 అని నిర్ధారించటం, దాని బాధ్యతను ఎ1 నిందితురాలు (జయలలిత) ఒక్కరిపైనే ఉంచటం సరికాదు. నిందితుల వాదనలు చాలా వాటిని విచారణ కోర్టు తిరస్కరించింది. సాక్షులను పిలిచి క్రాస్-ఎగ్జామినేషన్ చేయటం జరిగింది. ఇది కూడా నిందితులకు అనుకూలంగా వచ్చింది.
ఆదాయం చట్టబద్ధమే.. ఆస్తులు చట్టబద్ధమే...
అక్రమ మార్గాల ద్వారా వచ్చిన డబ్బుతో ఆస్తులు సమకూర్చుకున్నారని చెప్పటం కష్టం. కాబట్టి.. ఆస్తులను విచారణ కోర్టు జప్తు చేయటం చట్టం ప్రకారం నిలువజాలదు. స్థిరాస్తులు జాతీయ బ్యాంకుల నుంచి భారీ రుణాలు తీసుకోవటం ద్వారా సమకూర్చుకున్నవి. ఒక కుట్ర జరిగిందని, నిందితులు ఆ కుట్రలో భాగస్వాములని నమ్మటానికి ఒక కారణం ఉండాలి. అయితే.. ఈ కేసులో నిందితులు భారీ మొత్తం రుణాలు తీసుకున్నారని, వ్యవసాయ భూమి, ఇతర చట్టబద్ధమైన ఆస్తులను సమకూర్చుకున్నారని రికార్డులో ఉన్న సాక్ష్యాలు వెల్లడిస్తున్నాయి. ఆదాయమార్గం చట్టబద్ధమైనది. వస్తువు(ఆస్తులు) కూడా చట్టబద్ధమైనది. ఇక కేవలం ఎ1 నిందితురాలితో కలసి నివసిస్తున్న మాత్రానే మిగతా ముగ్గురూ కుట్రదారులు కాబోరు. ఇద్దరు లేదా అంతకుమించి వ్యక్తులు ఒక చట్టవ్యతిరేక పని చేయటమో, కూడబలుక్కోవటమో జరిగితే అది కుట్రవుతుంది.