చెన్నై మెరీనాబీచ్‌లో జయ సమాధి (ఫైల్)
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని అనేక పర్యాటక ప్రాంతాల్లో అతి ప్రతిష్టాకరమైన చెన్నై మెరీనాబీచ్‌లోని మాజీ సీఎంల సమాధుల ఉనికి ప్రశ్నార్థకమైంది. వాతావరణ, పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎంజీ రామచంద్రన్, జయలలితల సమాధులు నిర్మించారంటూ సామాజిక కార్యకర్త ‘ట్రాఫిక్’ రామస్వామి గతంలో వేసిన పిటిషన్‌లో అనూహ్యమైన కదలిక చోటుచేసుకుంది. మూడు సమాధులు తొలగించాలని పిటిషనర్ చేసిన వాదనకు మద్రాసు హైకోర్టుకు ప్రభుత్వం ఎలాం టి సమాధానం ఇవ్వనుందో అనే ఆసక్తి నెలకొంది.చెన్నై నగరం అనగానే పర్యాటకులకు ముందుగా గుర్తుకు వచ్చేది సుందరమైన మెరీనాబీచ్ తీరం, అందులో అందంగా నిర్మించిన అన్నాదురై, ఎంజీఆర్ సమాధులు. నగరానికి వచ్చిన వారు వీటిని సందర్శించకుండా పోరం టే అతిశయోక్తి కాదు.
నిత్యం వందలాది మందితో సమాధులు కిటకిటలాడుతుంటాయి. ఎంజీఆర్ సమా«ధి పక్కనే దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి కూడా చోటుచేసుకోవడంతో రద్దీ మరిం త పెరిగింది. సముద్రతీరంతోపాటు ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల సమాధులు కూడా చూడవచ్చేవారితో జనసంద్రంగా మారిపోతోంది. అన్నాదురై, ఎంజీఆర్ సమాధులకు దీటుగా జయలలితకు రూ.15 కోట్లతో స్మారకమండపం నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. ఇందుకు సంబంధించి అనేక ఆర్కిటెక్చర్లను పిలిపించి ప్లాన్లను పరిశీలిస్తోంది.
సమాధులపై అభ్యంతర పిటిషన్:ఇదిలా ఉండగా, ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టే ఆందోళనతో రాష్ట్రవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సా మాజిక కార్యకర్త ‘ట్రాఫిక్’ రామస్వామి సమాధులపై దృష్టిసారించారు. జయలలిత స్మారక మండప నిర్మాణంపై నిషే ధం విధించాలని, అన్నాదురై, ఎంజీఆర్ సమాధులను కూడా మెరీనా తీరం నుం చి తొలగించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో గతంలో వేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. పిటిషన్‌లోని వివరాల ప్రకారం.. సముద్రపు ఒడ్డు నుంచి 500 మీటర్లలోపు ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదని సముద్రతీర పర్యావరణ నిబంధనల్లో పేర్కొని ఉండగా అన్నాదురై, ఎంజీఆర్ సమాధులను నిర్మించి ఉన్నారని కోర్టుకు ఆయన తెలిపారు. ఇప్పటికే నిబంధన ఉల్లంఘన జరిగి ఉండగా మెరీనాబీచ్‌లోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధివద్ద రూ.15 కోట్లతో స్మారకమందిరం నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రకటించడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు.
మెరీనాతీరంలో ఉధృతంగా సాగిన జల్లికట్టు ఉద్యమం ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఆ పరిసరాల్లో నిరంతర 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు. సమాధుల సందర్శనకు పెద్ద సంఖ్యలో జనం వచ్చే మెరీనాతీరంలో 144వ సెక్షన్ అమలు ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి అనేక కారణాల దృష్ట్యా మూడు సమాధులను మెరీనాతీరం నుంచి తొలగించి చెన్నై గిండీలోని గాంధీపార్కు ప్రాంగణంలోకి తరలించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరాబెనర్జీ, న్యాయమూర్తి ఎమ్ సుందరం రెండువారాల్లోగా బదులివ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment