అమ్మ జయలలిత మరణం తదుపరి వారసత్వం కోసం పోటీపడుతున్న వాళ్లు ఎక్కువే. ఆమె ఆస్తులకు తానే నిజమైన వారసురాలినంటూ జయలలిత అన్న జయకుమార్ కుమార్తె దీప ఓవైపు, కాదు కాదు తానేనంటూ దీప సోదరుడు దీపక్ మరోవైపు నినదిస్తూ వస్తున్నారు. ఇక, అమ్మకు అన్నీ తానేనంటూ సీఎం పగ్గాలు సైతం చేపట్టేందుకు ప్రయత్నించి, చివరకు కటకటాల్లో చిన్నమ్మ శశికళ ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి. ఈ సమయంలో అమ్మకు తానే బిడ్డనంటూ ఓ యువకుడు తెర మీదకు వచ్చినా కోర్టు ఆగ్రహంతో అతగాడు పలాయనం చిత్తగించాడు.
అదే సమయంలో బెంగళూరుకు చెందిన అమృత(37) తాను అమ్మ బిడ్డనేనని, ఇప్పుడే తనకు తెలిసిందంటూ తెరమీదకు రావడం చర్చకు దారితీసింది. అయితే, ఆమె నినాదం కొద్ది రోజుల్లో సద్దుమణగడంతో అమ్మ వారసత్వం వ్యవహారం సమసినట్టేనని సర్వత్రా భావించారు. అయితే, తాను అమ్మ కడుపున పుట్టిన బిడ్డనేనని, డీఎన్‌ఏకు సిద్ధం అంటూ అమృత మళ్లీ తెరమీదకు రావడం చర్చకు దారితీసింది.
సాక్షి, చెన్నై : ‘అమ్మ జయలలిత నాకు జన్మనిచ్చిన తల్లి అని, శైలజమ్మ కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచారని’ బెంగళూరుకు చెందిన మంజుల అలియాస్ అమృత చేసిన వ్యాఖ్యలు తమిళనాట చర్చకు దారి తీశాయి. అమ్మకు నేనే వారసురాలినని, ఆమె మృత దేహాన్ని బయటకు తీసి డీఎన్‌ఏ పరీక్ష చేయాలంటూ కోర్టులో అమృత దాఖలు చేసిన పిటిషన్ సోమవారం తిరస్కరణకు గురైంది.
గౌరవం కోసం గోప్యం
అమృత వ్యాఖ్యల్ని గతంలో అనేక మందికొట్టి పారేసినా, జయలలితకు ఓ కుమార్తె ఉందన్న ప్రచారం మాత్రం సాగుతూనే వచ్చింది. ఈ పరిస్థితుల్లో అందరి అమ్మ జయమ్మే నాకు జన్మనిచ్చిన అమ్మ అని అమృత కోర్టుకు ఎక్కడం గమనార్హం. సుప్రీం కోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌లో తన పుట్టుక గురించి వివరించి ఉన్నారు. ఆ మేరకు 1980 ఆగస్టు 14వ తేదీన జయలలిత తనకు జన్మనిచ్చినట్టు పేర్కొన్నారు. అమ్మ అత్త జయలక్ష్మి ప్రసవం చూశారని, జయలక్ష్మి కుమార్తె లలిత, అమ్మమ్మ బంధువు రంజన రవీంద్రన్ ఆ సమయంలో జయలలితను దగ్గరుండి చూసుకున్నట్టు, కుటుంబం గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు వివరించారు. అమ్మ సోదరిగా ఉన్న శైలజ, సారథి దంపతులకు తనను అప్పగించారని పేర్కొన్నారు. అమ్మ జన్మనిస్తే, శైలజమ్మ కంటికి రెప్పలా పెంచారని వివరించారు. అమ్మను ఆంటీగానే పరిచయం చేశారని, తాను ఆంటీ అని పిలుస్తూనే వచ్చానని, తన మీద జయలలిత అమ్మ ఎంతో ప్రేమను చూపించే వారని తెలిపారు.
చాలారోజులు అక్కడ గడిపా
1996 నుంచి 2016 వరకు తాను పోయెస్ గార్డెన్‌కు వెళ్లి, అనేకసార్లు అక్కడే ఉన్న రోజులు ఉన్నాయని అమృత వివరించారు. అమ్మను కలిసిన విఐపీల లిస్టును పరిశీలిస్తే, తన పేరు ఎన్నిసార్లు ఉందో, తాను ఎన్ని రోజులు అక్కడున్నానో అన్న విషయం వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే, జయలలిత మరణం తదుపరి ఈ ఏడాది మార్చిలో ఆంటీ తనకు జన్మనిచ్చిన తల్లి అన్న విషయం బయటపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జయలక్ష్మి కుమార్తె లలిత ఈ విషయాన్ని తనకు తెలియజేశారని, అందుకే అమ్మకు బిడ్డగా సంప్రదాయబద్ధంగా జరగాల్సిన అంత్యక్రియల్ని నిర్వహించాలని ముందుకు వచ్చానని పేర్కొన్నారు. శ్రీ వైష్ణవ సంప్రదాయ పద్ధతిలో అమ్మకు జరపాల్సిన లాంఛనాలు నిర్వహించేందుకు నిర్ణయించానని, ఇందుకు అనుమతి ఇవ్వాలని, ఆమె మతృదేహాన్ని బయటకుతీసి, డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించి, తానే కుమార్తె అన్న విషయం ధ్రువీకరణ అయ్యేందుకు తగ్గ ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
అత్యంత రహస్యంగా పెంచారు
తాను పోయెస్ గార్డెన్‌కు వెళ్లినప్పుడల్లా ఆంటీ ఎంతో ప్రేమ చూపించే వారని, ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దులు పెడుతూ అమ్మ ప్రేమను మైమరపించే వారని ఓ తమిళ మీడియాతో అమృత వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు హైకోర్టును ఆశ్రయించమని చెప్పిందని, అందుకు తగ్గ ప్రయత్నాలు చేయనున్నట్టు తెలిపారు. ఆంటీ తనకు జన్మనిచ్చిన తల్లి అని తెలిసిన అనంతరం ఎంతో మనోవేదనకు గురైనట్టు పేర్కొన్నారు. ఎందుకు అంత రహస్యంగా పెంచాల్సి వచ్చిందో కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించానన్నారు. కేవలం కుటుంబ గౌరవం అన్న ఒక్క పదాన్ని అందరూ చెప్పుకొచ్చినట్టు తెలిపారు. రాజకీయాలకు తాను బలి కాకూడదన్న ఉద్దేశంతో రహస్యంగా పెంచినట్టు తన దృష్టికి తెచ్చారన్నారు. ఎన్నో బెదిరింపులు కూడా ఉన్నాయని పేర్కొంటూ, చిన్నమ్మ శశికళ కుటుంబాన్ని ఉద్దేశించి ఆమె స్పందించడం గమనార్హం. కాగా, డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధం అవుతూ అమృత కోర్టును ఆశ్రయించడం, అమ్మకు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించే అవకాశం కల్పించాలని వేడుకోవడం వెరసి తమిళనాట చర్చ ఊపందుకుంది. సామాజిక మాధ్యమాల్లో, మీడియాల్లో అమ్మ వారసురాలు ఎవరో అన్న చర్చ సాగడం గమనార్హం.
పిటిషన్ తిరస్కృతి
అమృత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బెంచ్ సోమవారం పరిశీలించి, విచారించబోమని స్పష్టం చేసింది. హైకోర్టును ఆశ్రయించకుండా, నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని వ్యతిరేకించింది. ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదని పేర్కొంటూ తిరస్కరించింది. అయితే, హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం కల్పించింది. ఈ సమయంలో అమృత తరఫున హాజరైన న్యాయవాది మద్రాసు హైకోర్టును ఆశ్రయించలేని పరిసితి ఉందని, అక్కడ భద్రత కారణాలు, శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు సూచించడంతో, అందుకు తగ్గ కసరత్తుల్లో అమృత నిమగ్నం అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment