'సిగ్గుంటే రాజీనామా చెయ్'
పట్నా: బిహార్ అధికార పార్టీ జనతా దళ్(యునైటెడ్) లో అంతర్గత కలహాలతో పరిస్థితి నానాటికీ ముదురుతోంది. రాజ్యసభ అధికార ప్రతినిధి పదవి నుంచి శరద్ యాదవ్‌ను తొలగించిన మరుసటి రోజే ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ నేత అజయ్ అలోక్. ఏ మాత్రం సిగ్గు ఉన్నా రాజ్యసభ పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.
'అధినేత నితీశ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు.. పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి కూడా వదులుకోవాలి కదా?' అని అలోక్, శరద్‌ను ప్రశ్నించారు. శరద్ గౌరవం పక్కనపెట్టి మరీ ఇంకా ఎంపీ పదవినే పట్టుకుని వెలాడుతున్నాడని, ఏ మాత్రం రోషం మిగిలి ఉన్నా తక్షణమే రాజీనామా చేయాలన్నారు. అవినీతిమయం అయినందునే మహాకూటమి నుంచి తాము బయటకు రావాల్సి వచ్చిందని అలోశ్ వివరణ ఇచ్చుకున్నారు.
అయితే శరద్‌ను తామేం తొలగించలేదని, ఆయన స్థానాన్ని ఆర్‌సీపీ సింగ్‌తో భర్తీ మాత్రమే చేశామని బిహార్ జేడీ(యూ) అధ్యక్షుడు నారాయణ్ సింగ్ తెలిపారు. మరో సీనియర్ నేత త్యాగి పార్టీలో చీలిక రాబోదని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకోపక్క తన తొలగింపు విషయంపై యాదవ్ పెద్దగా స్పందించకపోవటంతో త్వరలోనే ఈ ముసలం తగ్గిపోయే అవకాశం లేకపోలేదు. అయితే 19న జరిగే పార్టీ సర్వసభ్యసమావేశానికి పవార్, మరో అసంతృప్త ఎంపీ అలీ అన్వర్ గైర్జారయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.