* డిసెంబరు 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు
* అదే రోజు పూర్తి వివరాలతో కూడిన ఇన్ఫర్మేషన్ బులెటెన్ విడుదల
* ఈసారి ఇంటర్మీడియట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ యథాతథం
* 2016 ఏప్రిల్ 3న ఆఫ్‌లైన్ పరీక్ష
* అదే నెల 9, 10 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్:
దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 2016లో ఇంజనీరింగ్ (బీటెక్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్కుకేషన్ (సీబీఎస్‌ఈ) ఈ ప్రవేశాల నోటీసును (నోటిఫికేషన్) బుధవారం జారీ చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను జేఈఈ మెయిన్ వెబ్‌సైట్‌లో (jeemain.nic.in) అందుబాటులో ఉంచింది.
డిసెంబరు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని అందులో వెల్లడించింది. పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం, సిలబస్, అర్హతలు, పరీక్ష ఫీజు, పరీక్ష కేంద్రాలు, వయో పరిమితి, నార్మలైజేషన్ విధానం, రిజర్వేషన్లు తదితర అన్నింటికి సంబంధించిన ఇన్‌ఫర్మేషన్ బులెటిన్‌ను డిసెంబరు 1న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని వివరించింది. అంతేకాదు 2016-17 విద్యా సంవత్సరం ప్రవేశాల్లో ఇంటర్మీడియట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుందని స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ, జేఈఈ మెయిన్ స్కోర్‌కు 60 శాతం వెయిటేజీ ఇచ్చి నార్మలైజేషన్ చేసి తుది ర్యాంకును ఖరారు చేసి, వాటి ఆధారంగా ప్రవేశాలు చేపడతామని వివరించింది.
జాతీయ స్థాయి విద్యా సంస్థలతోపాటు వివిధ రాష్ట్రాలు జేఈఈ మెయిన్ స్కోర్ ద్వారా ఇంజనీరింగ్‌లో ప్రవేశాలను చేపడుతున్నాయి. ఈసారి గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, నాగాలాండ్, ఒడిషా రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు చేపట్టేందుకు ముందుకు వచ్చాయని వివరించింది.
ఇదీ జేఈఈ మెయిన్‌కు పరీక్షలకు సంబంధించిన వివరాలు..
- 2016 ఏప్రిల్ 3న ఆఫ్‌లైన్ (పెన్ను పేపరు బేస్డ్) పేపరు -1 పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష ఉంటుంది.
- ఏప్రిల్ 9, 10 తేదీల్లో బీఈ/బీటెక్‌లో ప్రవేశాల కోసం ఆన్ పరీక్షలు (కంప్యూటర్ ఆధారిత) ఉంటాయి. ఈ పరీక్షలను రెండు షిఫ్ట్‌లుగా నిర్వహించనుంది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 2 గంటల వరకు రెండో షిప్టులో పరీక్ష నిర్వహిస్తుంది.
- బీఈ/బీటెక్‌లో ప్రవేశాలు పొందాలనుకునే వారు జేఈఈ మెయిన్ పేపరు-1 పరీక్ష రాయాల్సి ఉంటుంది.
- బీఆర్క్/బీప్లానింగ్ కోర్సుల్లో చేరాలనుకునే వారు పేపరు-2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. లేదా రెండు పేపర్లు రాయవచ్చు.
- బీఈ/బీటెక్ కోసం పేపరు-1లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది.
- బీఆర్క్/బీప్లానింగ్ కోసం నిర్వహించే పేపరు-2లో మ్యాథ్స్ పార్ట్-1, ఆప్టిట్యూడ్ టెస్టు - పార్ట్2, డ్రాయింగ్ టెస్టు-పార్ట్-3 పేపర్లు ఉంటాయి.
- 2014, 2015 సంవత్సరాల్లో 12వ తరగతి / తత్సమాన (మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్) పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఈ పరీక్షలు రాసేందుకు అర్హులు. 2016 ఇంటర్మీడియట్ పరీక్షలు రాయబోయే వారు కూడా అర్హులే.
- 2013లో, అంతకంటే ముందు ఇంటర్మీడియట్‌లో పాస్ అయిన వారు 2016 జేఈఈ మెయిన్ రాసేందుకు అర్హులు కాదు. వారు 2017 లేదా ఆ తరువాత రాసుకోవాలి.
- 2013లో ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అయి, 2014లో ఇంటర్మీడియట్‌లో పాస్ అయిన వారు కూడా 2016 జేఈఈ మెయిన్ రాసేందుకు అనర్హులే .
- 2016లో 12వ తరగతి/ఇంటర్మీడియట్‌లో ఇంప్రూవ్‌మెంట్ రాసే వారు ఐదు సబ్జెక్టుల్లో రాయాల్సి ఉంటుంది. పర్సంటైల్ ఖరారులో ఒకే సంవత్సరంలో పాసైన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
- జేఈఈ మెయిన్‌ను ఒక విద్యార్థి మూడుసార్లు మాత్రమే రాయవచ్చు.
- పరీక్ష ఫీజును క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఈ-చలనా రూపంలోనూ చెల్లించవచ్చు. జేఈఈ మెయిన్ (ఆఫ్‌లైన్) పేపరు-1, పేపరు-2లలో ఏదో ఒక పరీక్షకు జనరల్, ఓబీసీ బాలురు రూ. 1000, బాలికలైతే రూ. 500 ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు ఎవరైనా రూ. 500 చెల్లించాలి. పేపరు-1, పేపరు-2 రెండూ రాయాలనుకుంటే జనరల్, ఓబీసీ బాలురు రూ. 1,800, బాలికలు రూ. 900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ. 900 చెల్లించాలి.
- ఆన్‌లైన్ పరీక్షకు అయితే ఏదో ఒక పేపరుకు జనరల్, ఓబీసీ విద్యార్థుల్లో బాలురు రూ. 500, బాలికలు రూ. 250 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు ఎవరైనా రూ. 250 చెల్లించాలి. రెండు పేపర్లు రాయాలనుకుంటే జనరల్, ఓబీసీ బాలురు రూ. 1,300, బాలికలు రూ. 650 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ. 650 చెల్లించాలి.
- ఈ పరీక్షలకు హాజరయ్యే జనరల్ విద్యార్థులు 1991 అక్టోబరు 1వ తేదీన లేదా ఆ తరువాత తరువాత జన్మించిన వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు అయితే 1986 అక్టోబరు 1వ తేదీన లేదా ఆ తరువాత పుట్టిన వారై ఉండాలి.