సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్‌కు వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ కానుంది. ఏప్రిల్ 2న జేఈఈ మెయిన్ రాత పరీక్ష నిర్వహించాలని ఇప్పటికే తేదీని ఖరారు చేసిన నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశ ం కల్పించేలా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ప్రవేశాల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఇకపై ఇంటర్మీడియెట్ మార్కులతో పెద్దగా పని లేదు. ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీటు కావాలనుకునే విద్యార్థులు ఇకపై జేఈఈ మెయిన్‌లో ర్యాంకుతోపాటు ఇంటర్‌లో 75 శాతం (ఎస్సీ, ఎస్టీలైతే 65 శాతం) మార్కులు సాధిస్తే చాలు.
ప్రస్తుతం జేఈఈ మెయిన్ ర్యాంకుల ఖరారులో విద్యార్థుల ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ, జేఈఈ మెయిన్ స్కోర్‌కు 60 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకులను సీబీఎస్‌ఈ ఖరారు చేస్తోంది. వాటి ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తోంది. అయితే ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని ఐఐటీల కౌన్సిల్ 2015 అక్టోబర్‌లో నిర్వహించిన సమావేశంలో అభిప్రాయానికి వచ్చింది. దీంతో జేఈఈ పరీక్షలో సంస్కరణలపై కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ జేఈఈ మెయిన్ ర్యాంకుల ఖరారుకు పరిగణనలోకి తీసుకుంటున్న వెయిటేజీని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అలాగే టాప్-20 పర్సంటైల్‌లో ఉన్నా సరిపోతుందని పేర్కొంది. ఆ సిఫారసుల మేరకు విద్యార్థుల ఇంటర్ మార్కులకు ఇస్తున్న 40 శాతం వెయిటేజీని రద్దు చేస్తూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫీజును పెంచిన నేపథ్యంలో జేఈఈ మెయిన్ పరీక్ష ఫీజును కూడా పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
వచ్చే నెలలో జేఈఈ మెయిన్ నోటిఫికేషన్
Published Mon, Oct 17 2016 2:33 AM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM
Advertisement
Advertisement