ఏప్రిల్ 9న టెట్
షెడ్యూల్ జారీ చేసిన విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురుచూస్తున్న ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)’ షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 9వ తేదీన టెట్ పరీక్ష జరుగనుంది. దీనికి దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 29 నుంచే ప్రారంభం కానుంది. పరీక్ష ఫీజు రూ. 200. 29వ తేదీ నుంచే ఫీజులు చెల్లించి, మార్చి 1 నుంచి ఆన్‌లైన్ (http://tstet.cgg. gov.in)లో దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చు. 15,628 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏప్రిల్ నెలాఖరులో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని, జూన్‌లో పరీక్ష నిర్వహిస్తామని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే డీఎస్సీ పరీక్షకు హాజరుకావాలంటే టెట్‌లో ఉత్తీర్ణత సాధిం చడం తప్పనిసరి. దీంతో టెట్ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ గతేడాది నవంబర్‌లోనే జారీ చేసింది. నిబంధనలు, అర్హతలు, ఇతర వివరాలతో కూడిన మార్గదర్శకాలను డిసెంబర్ 12న విడుదల చేసింది. కానీ వరంగల్ ఉప ఎన్నికల కోడ్ కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. తరువాత కూడా పలు కారణాలతో దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికలు ఉండడంతో ‘టెట్’ నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం విద్యా శాఖ లేఖ రాసింది. శుక్రవారం ఎన్నికల కమిషన్ అనుమతివ్వడం, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ‘టెట్’ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 29 నుంచి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభిస్తామని పాఠశాల విద్యా డెరైక్టర్ జి.కిషన్ తెలిపారు. కాగా ఈసారి టెట్‌కు 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరవుతారని అధికారుల అంచనా.
ఇదీ టెట్ షెడ్యూల్
ఫిబ్రవరి 29 నుంచి: వెబ్‌సైట్ నుంచి పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ఫిబ్రవరి 29 నుంచి మార్చి 14 వరకు: ఫీజులు, దరఖాస్తులకు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణ
మార్చి 1 నుంచి 15 వరకు: ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదు
ఫిబ్రవరి 29 నుంచి ఏప్రిల్ 9 వరకు: హెల్ప్ డెస్క్ సేవలు
మార్చి 30వ తేదీ నుంచి: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
ఏప్రిల్ 9న: ‘టెట్’ పరీక్ష (ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్-1 (డీఎడ్ అభ్యర్థులకు), మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు పేపర్-2(బీఎడ్, పండిట్ అభ్యర్థులకు)
ఏప్రిల్ 23న: ఫలితాల వెల్లడి