
మోడీ పెంచిన బిడ్డ తల్లిదండ్రుల చెంతకు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ పర్యటనకు మానవతా కోణంతో కూడిన ఓ ప్రత్యేకత ఉంది. పసితనంలో నిస్సహాయ స్థితిలో మోడీ వద్ద పెరిగిన జీత్ బహదూర్ అనే ఓ బాలుడు ఇన్నేళ్లకు బీబీఏ డిగ్రీ విద్యార్థిగా ఎదిగి, నేపాల్‌లోని తన తల్లిదండ్రులను ఆదివారం కలుసుకోబోతున్నాడు. మోడీనే స్వయంగా అతన్ని వారికి అప్పగించనున్నారు. మోడీ ట్విట్టర్‌లో ఈ విషయం చెప్పారు. కొన్నేళ్ల కిందట తాను బహదూర్‌ను ఎలా కలుసుకున్నదీ వివరించారు. పసితనంలో, ఏ భాషా అర్థంచేసుకోలేని స్థితిలో బహదూర్ తన దృష్టిలో పడ్డాడని, చదువులో ఆటల్లో ఆసక్తి పెంచుకుని, గుజరాతీ నేర్చుకున్నాడనితెలిపారు. అదృష్టవశాత్తూ ఇన్నాళ్లకు అతని తల్లిదండ్రులను గుర్తించగలిగామని, బహదూర్ కాలికి ఆరువేళ్లు ఉండటంతో వారు అతన్ని గుర్తించేందుకు వీలైందన్నారు.
జీత్ బహదూర్ పూర్తిపేరు జీత్ బహదూర్ మాగర్. అతని కుటుంబం పశ్చిమ నేపాల్‌లోని కవసోటీ మునిసిపాలిటీలో ఒక మురికివాడలో ఉంటోంది. నేపాల్ పత్రికలు అందించిన సమాచారం.. ప్రకారం జీత్ బహదూర్ ప్రస్తుతం బీబీఏ చదువుతున్నాడు. 1998లో పలువురు నేపాలీయులు భారత్‌కు వలసవచ్చినపుడు బహదూర్ కూడా తన అన్నతో కలసి రాజస్థాన్ చేరుకున్నాడు. అయితే, అతని అన్న రాజస్థాన్‌లో తను చేస్తున్నపని నచ్చకపోవడంతో తిరిగి నేపాల్ వెళ్లాలనుకున్నాడు. వెళ్లేటపుడు, నేపాల్ సరిహద్దులోని గోరఖ్‌పూర్ వెళ్లే రైలు ఎక్కాల్సిన బహదూర్,.. పొరపాటున అహ్మదాబాద్ రైలు ఎక్కేశాడు. అహ్మదాబాద్ చేరుకున్న బహదూర్‌ను గమనించిన ఓ మహిళ అతన్నిమోడీ ఇంటికి తీసుకెళ్లింది. అప్పటికి మోడీ ముఖ్యమంత్రి కాదు. అప్పటి నుంచి మోడీ సంరక్షణలోనే బహదూర్ పెరిగాడు. మోడీ ప్రధాని అయ్యాక ఆయనతో పాటు ఢిల్లీ చేరుకున్నాడు. అతని బస యూనివర్సిటీ హాస్టల్‌కు మారింది. ఇన్నాళ్లూ మోడీ సంరక్షణలో పెరిగిన బహదూర్‌ను తమతో తీసుకెళ్లేందుకు, మోడీని కలుసుకునేందుకు బహదూర్ తల్లి, అన్న, వదిన, చెల్లి ఇప్పటికే కఠ్మూండూ చేరుకున్నారు. కఠ్మాండూలోని భారతీయ రాయబార కార్యాలయం ఇందుకు ఏర్పాట్లు చేసింది. మోడీ తన సమక్షంలోనే బహదూర్‌ను అతని కుటుంబంతో కలవాలని ఆశిస్తున్నారని జీత్ బహదూర్ అన్న దశరథ్ చెప్పారు.