
16 ఏళ్ల తర్వాత కుటుంబం వద్దకు
కఠ్మాండు: పదహారేళ్లకిందట పరదేశంలో తప్పిపోయిన కొడుకు తిరిగి తమ చెంతకు చేరడం ఆ నిరుపేద నేపాలీ కుటుంబంలో ఆనందం నింపింది. పదేళ్ల వయసులో అన్న దశరథ్ వెంట భారత్‌కు వచ్చిన జీత్ బహదూర్ తప్పిపోయాడు. అదృష్టంకొద్ది అహ్మదాబాద్‌లో ప్రస్తుత భారత ప్రధాని నరేంద్రమోడీ వద్దకు చేరాడు. అప్పటినుంచి మోడీ సంరక్షణలోనే ఉంటున్న 26 ఏళ్ల జీత్ ఇప్పుడు బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. జీత్ కుటుంబం గురించి చేసిన అన్వేషణ ఫలించడంతో నేపాల్ పర్యటనకు వచ్చిన మోడీ ఆదివారం అతడిని తల్లి ఖగిసర, అన్న దశరథ్ సురుమగర్‌కు అప్పగించారు.
కన్న కొడుకులా జీత్‌కు విద్యాబుద్ధులు చెప్పించి తమ వద్దకు చేర్చినందుకు తల్లి ఖగిసర మోడీకి ధన్యవాదాలు తెలిపింది. కొడుకును మళ్లీ కలుసుకున్నందుకు ఎలా అనిపిస్తోందని మోడీ ఆమెను అడిగారు. మోడీ తనను ఎంతో ఆదరంగా చూసుకున్నారని జీత్ చెప్పాడు. ఖగిసర కుటుంబం నేపాల్‌లోని నవాల్‌పరాస్ జిల్లాలో మురికివాడలో ఆ కుటుంబం నివసిస్తోంది. కుటుంబాన్ని కలుసుకున్నప్పటికీ భారత్‌లోనే చదువు పూర్తిచేస్తానని జీత్ తెలిపాడు. హిందీలో బాగా మాట్లాడే జీత్... నేపాలీభాషను దాదాపు మరచిపోయాడు. కొద్దిగామాత్రం అర్థంచేసుకోగలుగుతున్నాడు. ఇన్నాళ్లూ ఓ వీఐపీవద్ద పెరిగినందుకు ఆనందంగా ఉందని, అయితే వీఐపీ వద్ద ఉంటున్నానన్న భావన తనకు ఎప్పుడూ కలగలేదని జీత్ అన్నాడు.