
నా బిడ్డకు మోడీ కొత్త జీవితాన్ని ఇచ్చారు!
కఠ్మాండు: 'నేను నా బిడ్డకు జన్మినిస్తే.. భారత ప్రధాని నరేంద్ర మోడీ నా కొడుక్కి కొత్త జీవితాన్ని ప్రసాదించారని' జీత్ బహదూర్ తల్లి ఖాగిసర మగర్ తెలిపారు. పదహారేళ్లకిందట పరదేశంలో తప్పిపోయిన కొడుకును మోడీ తిరిగి తమ చెంతకు చేర్చడంతో ఆ నిరుపేద నేపాలీ కుటుంబంలో ఆనందంలో మునిగిపోయింది. పదేళ్ల వయసులో అన్న దశరథ్ వెంట భారత్‌కు వచ్చిన జీత్ బహదూర్ తప్పిపోయాడు. అదృష్టంకొద్ది అహ్మదాబాద్‌లో ప్రస్తుత భారత ప్రధాని నరేంద్రమోడీ వద్దకు చేరాడు. అప్పటినుంచి మోడీ సంరక్షణలోనే ఉంటున్న 26 ఏళ్ల జీత్ ఎట్టకేలకు తల్లిదండ్రుల వద్దకు చేరాడు. జీత్ కుటుంబం గురించి చేసిన అన్వేషణ ఫలించడంతో నేపాల్ పర్యటనకు వచ్చిన మోడీ ఆదివారం అతడిని తల్లి ఖగిసర, అన్న దశరథ్ సురుమగర్‌కు అప్పగించారు.
ఆ సందర్భంగా జీత్ బహదూర్ తల్లి కన్నీటి పర్యంతమైయ్యారు. 'నేను జన్మనిస్తే.. మీరు మాత్రం నా బిడ్డకు చక్కటి మార్గం చూపించారని, భవిష్యత్తులో నా కుమారుని ఉన్నత విద్యకు మీ సలహాలు తప్పకుండా తీసుకుంటామని' ఆమె మోడీతో అన్నారు.