సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెసీకా లాల్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మను శర్మ ముందస్తుగా తనను విడుదల చేయాలంటూ చేసిన అభ్యర్థనను ఢిల్లీ ప్రభుత్వం నిరాకరించింది. అతడితో పాటుగా ప్రియదర్శిని మట్టూ అనే యువతి హత్య కేసులో నిందితుడైన సంతోష్ సింగ్, తాండూర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సుశీల్ శర్మలను కూడా శిక్షా కాలం పూర్తికాకముందే విడుదల చేయలేమని తేల్చి చెప్పింది.
ఢిల్లీ హోం మంత్రి సత్యేంద్ర జైన్ అధ్యక్షతన సమావేశమైన శిక్షాకాల పునఃసమీక్ష బోర్డు(సెంటెన్స్ రివ్యూ బోర్డు- ఎస్సార్బీ) గురువారం సమావేశమైంది. ఇందులో భాగంగా ముందస్తు విడుదల కోసం అప్లై చేసుకున్న 108 మంది ముద్దాయిల దరఖాస్తులను బోర్డు పరిశీలించింది. ఇందులో 86 మంది అభ్యర్థనను తిరస్కరించిన బోర్డు సభ్యులు.. సత్ప్రవర్తన కలిగిన 22 మందిని మాత్రం శిక్షా కాలం కంటే ముందే విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు. అత్యంత హేయమైన నేరాల్లో భాగమైన మనుశర్మ, సంతోష్ సింగ్, సుశీల్ శర్మ వంటి వ్యక్తులను ముందస్తుగా విడుదల చేయడం అంత శ్రేయస్కరం కాదని బోర్డు వ్యాఖ్యానించింది. కాగా జైళ్ల డీజీ అజయ్ కశ్యప్, హోం సెక్రటరీ మనోజ్ పరీదా, ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్, జిల్లా జడ్జి, లా సెక్రటరీ అనూప్ తదితరులు ఎస్సార్బీ సభ్యులుగా ఉన్నారు.
కాగా ఒక ప్రైవేటు బార్‌లో పనిచేస్తున్న జెసికా లాల్ 1999లో హత్యకు గురయ్యారు. జెసికా మరణించిన రోజు మనుశర్మ మాజీ మంత్రి వినోద్ శర్మ కుమారుడితో కలిసి ఆమె పనిచేస్తున్న బార్‌కు వెళ్లాడు. ఆ రోజు జెసికాను మద్యం తీసుకురమ్మని మనుశర్మ ఆదేశించాడు. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో ఆమె నిరాకరించింది. ఆ కోపంలో జెసికాను పాయింట్ బ్లాంక్‌లో తుపాకీతో కాల్చి చంపాడు. దీంతో పోలీసులు మనుశర్మ మీద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అతడిలో మార్పు వచ్చిందని భావించిన జెసికా సోదరి సబ్రినా లాల్ అతడిని విడుదల చేస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని జైళ్ల శాఖకు లేఖ రాయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment