Jessica Lal murder
-
జెసికా లాల్ హత్యకేసు: మను శర్మ విడుదల
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెసికా లాల్ హత్య కేసులో దోషిగా తేలిన మను శర్మ అలియాస్ సిద్ధార్థ్ వశిష్ట తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. శిక్షాకాల పునః సమీక్ష బోర్డు(సెంటెన్స్ రివ్యూ బోర్డు- ఎస్సార్బీ) సిఫార్సు మేరకు.. వివిధ నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న దోషులను విడుదల చేసేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలో మను శర్మతో పాటుగా మరో 18 మంది సోమవారం విడుదలయ్యారు. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పెరోల్ మీద బయట ఉన్న మను శర్మకు సుదీర్ఘ నిరీక్షణ అనంతరం పూర్తిస్థాయిలో జైలు నుంచి విముక్తి లభించింది. (చదవండి: కరోనా : కొత్త యాప్ ప్రారంభించిన ఢిల్లీ సీఎం) కాగా ఓ ప్రైవేటు బార్లో పనిచేస్తున్న జెసికా లాల్‌ను 1999లో మను శర్మ అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. సమయం మించిపోయిన కారణంగా తనకు మద్యం సర్వ్ చేసేందుకు జెసికా నిరాకరించడంతో.. ఆమెను పాయింట్ బ్లాంక్‌లో తుపాకీతో కాల్చి చంపాడు. ఈ క్రమంలో పోలీసులు మనుశర్మ మీద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. 2006లో నేరం నిరూపితం కావడంతో.. యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 2010లో దిగువ కోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు శిక్షను ఖరారు చేసింది. ఆనాటి నుంచి అతడు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక గత రెండేళ్లుగా సత్ప్రవర్తనతో మెలుగుతున్న కారణంగా ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు బయటకు వెళ్లి పని చేసేందుకు మను శర్మకు అవకాశం లభించింది. దీంతో ఖైదీల పునరావాస కేంద్రంలో అతడు పనిచేస్తున్నాడు.(కరోనా : రాజధాని సరిహద్దులు మూత) ఈ నేపథ్యంలో మనుశర్మలో మార్పు వచ్చిందని భావించిన జెసికా సోదరి సబ్రినా లాల్ అతడిని విడుదల చేస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని 2018లో జైళ్ల శాఖకు లేఖ రాశారు. ఈ క్రమంలో ముందస్తుగా తనను విడుదల చేయాలంటూ రెండేళ్ల క్రితం అతడు చేసిన అభ్యర్థనను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. అత్యంత హేయమైన నేరాల్లో భాగమైన మనుశర్మకు ఈ అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఇక అనేక పరిణామాల అతడిని విడుదల చేయాల్సిందిగా ఎస్సార్బీ సూచించడంతో అతడు మూడేళ్ల ముందుగానే బయటకు వచ్చాడు. కాగా మను శర్మ కాంగ్రెస్ నేత వినోద్ శర్మ కుమారుడన్న సంగతి తెలిసిందే. -
అతడిని విడుదల చేయడం కుదరదు!!
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెసీకా లాల్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మను శర్మ ముందస్తుగా తనను విడుదల చేయాలంటూ చేసిన అభ్యర్థనను ఢిల్లీ ప్రభుత్వం నిరాకరించింది. అతడితో పాటుగా ప్రియదర్శిని మట్టూ అనే యువతి హత్య కేసులో నిందితుడైన సంతోష్ సింగ్, తాండూర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సుశీల్ శర్మలను కూడా శిక్షా కాలం పూర్తికాకముందే విడుదల చేయలేమని తేల్చి చెప్పింది. ఢిల్లీ హోం మంత్రి సత్యేంద్ర జైన్ అధ్యక్షతన సమావేశమైన శిక్షాకాల పునఃసమీక్ష బోర్డు(సెంటెన్స్ రివ్యూ బోర్డు- ఎస్సార్బీ) గురువారం సమావేశమైంది. ఇందులో భాగంగా ముందస్తు విడుదల కోసం అప్లై చేసుకున్న 108 మంది ముద్దాయిల దరఖాస్తులను బోర్డు పరిశీలించింది. ఇందులో 86 మంది అభ్యర్థనను తిరస్కరించిన బోర్డు సభ్యులు.. సత్ప్రవర్తన కలిగిన 22 మందిని మాత్రం శిక్షా కాలం కంటే ముందే విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు. అత్యంత హేయమైన నేరాల్లో భాగమైన మనుశర్మ, సంతోష్ సింగ్, సుశీల్ శర్మ వంటి వ్యక్తులను ముందస్తుగా విడుదల చేయడం అంత శ్రేయస్కరం కాదని బోర్డు వ్యాఖ్యానించింది. కాగా జైళ్ల డీజీ అజయ్ కశ్యప్, హోం సెక్రటరీ మనోజ్ పరీదా, ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్, జిల్లా జడ్జి, లా సెక్రటరీ అనూప్ తదితరులు ఎస్సార్బీ సభ్యులుగా ఉన్నారు. కాగా ఒక ప్రైవేటు బార్లో పనిచేస్తున్న జెసికా లాల్ 1999లో హత్యకు గురయ్యారు. జెసికా మరణించిన రోజు మనుశర్మ మాజీ మంత్రి వినోద్ శర్మ కుమారుడితో కలిసి ఆమె పనిచేస్తున్న బార్‌కు వెళ్లాడు. ఆ రోజు జెసికాను మద్యం తీసుకురమ్మని మనుశర్మ ఆదేశించాడు. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో ఆమె నిరాకరించింది. ఆ కోపంలో జెసికాను పాయింట్ బ్లాంక్‌లో తుపాకీతో కాల్చి చంపాడు. దీంతో పోలీసులు మనుశర్మ మీద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అతడిలో మార్పు వచ్చిందని భావించిన జెసికా సోదరి సబ్రినా లాల్ అతడిని విడుదల చేస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని జైళ్ల శాఖకు లేఖ రాయడం విశేషం. -
అనూహ్యం: అతడిని క్షమించిన సబ్రినా
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జెసికా లాల్ హత్యకేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దోషిగా నిరూపించబడి యావజ్జీవ కారగార శిక్ష అనుభవిస్తున్న మనుశర్మ(41)ను తాను క్షమిస్తున్నట్లు జెసిక సోదరి సబ్రినా లాల్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆమె ఢిల్లీ తీహార్ జైలు సంక్షేమ అధికారికి ఒక లేఖ రాశారు. దీనిలో ఆమె మనుశర్మ 12 సంవత్సరాల నుంచి జైలులో ఉన్నాడని, ఈ సమయంలో అతను సేవా సంస్థలకు, జైలులోని ఇతర ఖైదీలకు చాలా సహాయం చేశాడని ఇవన్ని అతడిలో వచ్చిన మార్పును సూచిస్తున్నాయని తెలిపారు. అతడి విడుదల విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. ప్రస్తుతం మనుశర్మ తీహార్‌లోని ఓపెన్ జైల్లో ఉంటున్నాడు. జైల్లో సత్ప్రవర్తన చూపిన ఖైదీలను ఓపెన్ జైలుకు పంపిస్తామని, అందులో భాగంగానే ఆరు నెలల క్రితం అతడిని అక్కడికి తరలించినట్టు తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ అజయ్ కశ్యప్ తెలిపారు. సబ్రినా లాల్ రాసిన లేఖ గురించి మాట్లాడటానికి ఆయన నిరాకరించారు. దాని గురించి తనకు ఎటువంటి సమాచారం తెలియదని తెలిపారు. ప్రస్తుతం సిద్ధార్థ వశిష్ట అలియాస్ మనుశర్మ తన పేరు మీద ఒక సంస్థను స్థాపించి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఖైదీలకు, వారి పిల్లలకు పునారావాసం కల్పిస్తున్నారు. ఒక ప్రైవేటు బార్లో పనిచేస్తున్న జెసికా లాల్ 1999లో హత్యకు గురయ్యారు. జెసిక మరణించిన రోజు మనుశర్మ మాజీ మంత్రి వినోద్ శర్మ కుమారుడితో కలిసి ఆమె పనిచేస్తున్న బార్‌కు వెళ్లాడు. ఆ రోజు జెసికను మద్యం తీసుకురమ్మని మనుశర్మ ఆదేశించాడు. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో ఆమె నిరాకరించింది. ఆ కోపంలో జెస్సికను పాయింట్ బ్లాంక్ రెంజ్లో తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు మనుశర్మ మీద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. జెస్సికా లాల్ (ఫైల్ ఫొటో) ట్రయల్ కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు రేగాయి. దాంతో 2006లో ఈ కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. కింది కోర్టులో నిర్లక్ష్యం చేసిన సాక్ష్యాలను పరిశీలించిన తరువాత హైకోర్టు మనుశర్మ నేరం చేశాడని నిర్ధారించి, శిక్ష విధించింది. సుప్రీంకోర్టు ఈ తీర్పును ధ్రువీకరించింది. అప్పటి నుంచి మనుశర్మ జైలు జీవితం గడుపుతున్నారు. జైలులో ప్రత్యేక వసతులు పొందుతున్నారనే ఆరోపణలు కూడా గతంలో వచ్చాయి. అరెస్టైన నాటి నుంచి దాదాపు 15 ఏళ్ల జైలు జీవితంలో మనుశర్మకు మూడుసార్లు పెరోల్ లభించింది. 2009లో తన నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఒకసారి, 2011లో తన సోదరుని వివాహానికి హజరుకావడానికి, 2013లో తన మాస్టర్స్ డిగ్రీ పరీక్షల నిమిత్తం పెరోల్ తీసుకున్నారు. -
జెసికాలాల్ కేసులో మున్షీకి బెయిల్
న్యూఢిల్లీ: మోడల్ జెసికాలాల్ హత్యపై తప్పుడు సాక్ష్యం చెప్పిన కేసులో బాలీ వుడ్ నటుడు శయన్ మున్షీకి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అభియోగాల నమోదుపై వాదోపవాదాలను వచ్చే ఫిబ్రవరి ఐదున వింటామని ప్రకటించింది. ఇది బెయిల్‌కు అర్హమైన కేసు కావడంతో చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ విద్యాప్రకాశ్ పైనిర్ణయం తీసుకున్నారు. ఇందుకు రూ.50 వేల విలువైన వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని ఆదేశిం చారు. కేసు వాయిదాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లవద్దని న్యాయమూర్తి మున్షీని ఆదేశించారు. ఇదే కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నిందితుడు ప్రేమ్మనోచాపై విచారణను నిలిపివేస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అతని తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. మనోచాపై తదుపరి విచారణను ఫిబ్రవరి ఐదుకు వాయిదా వేస్తున్నట్టు ప్రకాశ్ ప్రకటించారు.