జెసికాలాల్ కేసులో మున్షీకి బెయిల్
న్యూఢిల్లీ: మోడల్ జెసికాలాల్ హత్యపై తప్పుడు సాక్ష్యం చెప్పిన కేసులో బాలీ వుడ్ నటుడు శయన్ మున్షీకి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అభియోగాల నమోదుపై వాదోపవాదాలను వచ్చే ఫిబ్రవరి ఐదున వింటామని ప్రకటించింది. ఇది బెయిల్‌కు అర్హమైన కేసు కావడంతో చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ విద్యాప్రకాశ్ పైనిర్ణయం తీసుకున్నారు. ఇందుకు రూ.50 వేల విలువైన వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని ఆదేశిం చారు. కేసు వాయిదాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లవద్దని న్యాయమూర్తి మున్షీని ఆదేశించారు. ఇదే కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నిందితుడు ప్రేమ్‌మనోచాపై విచారణను నిలిపివేస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అతని తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. మనోచాపై తదుపరి విచారణను ఫిబ్రవరి ఐదుకు వాయిదా వేస్తున్నట్టు ప్రకాశ్ ప్రకటించారు.