
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెసికా లాల్ హత్య కేసులో దోషిగా తేలిన మను శర్మ అలియాస్ సిద్ధార్థ్ వశిష్ట తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. శిక్షాకాల పునః సమీక్ష బోర్డు(సెంటెన్స్ రివ్యూ బోర్డు- ఎస్సార్బీ) సిఫార్సు మేరకు.. వివిధ నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న దోషులను విడుదల చేసేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలో మను శర్మతో పాటుగా మరో 18 మంది సోమవారం విడుదలయ్యారు. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పెరోల్ మీద బయట ఉన్న మను శర్మకు సుదీర్ఘ నిరీక్షణ అనంతరం పూర్తిస్థాయిలో జైలు నుంచి విముక్తి లభించింది. (చదవండి: కరోనా : కొత్త యాప్ ప్రారంభించిన ఢిల్లీ సీఎం)
కాగా ఓ ప్రైవేటు బార్‌లో పనిచేస్తున్న జెసికా లాల్‌ను 1999లో మను శర్మ అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. సమయం మించిపోయిన కారణంగా తనకు మద్యం సర్వ్ చేసేందుకు జెసికా నిరాకరించడంతో.. ఆమెను పాయింట్ బ్లాంక్‌లో తుపాకీతో కాల్చి చంపాడు. ఈ క్రమంలో పోలీసులు మనుశర్మ మీద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. 2006లో నేరం నిరూపితం కావడంతో.. యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 2010లో దిగువ కోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు శిక్షను ఖరారు చేసింది. ఆనాటి నుంచి అతడు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక గత రెండేళ్లుగా సత్ప్రవర్తనతో మెలుగుతున్న కారణంగా ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు బయటకు వెళ్లి పని చేసేందుకు మను శర్మకు అవకాశం లభించింది. దీంతో ఖైదీల పునరావాస కేంద్రంలో అతడు పనిచేస్తున్నాడు.(కరోనా : రాజధాని సరిహద్దులు మూత)
ఈ నేపథ్యంలో మనుశర్మలో మార్పు వచ్చిందని భావించిన జెసికా సోదరి సబ్రినా లాల్ అతడిని విడుదల చేస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని 2018లో జైళ్ల శాఖకు లేఖ రాశారు. ఈ క్రమంలో ముందస్తుగా తనను విడుదల చేయాలంటూ రెండేళ్ల క్రితం అతడు చేసిన అభ్యర్థనను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. అత్యంత హేయమైన నేరాల్లో భాగమైన మనుశర్మకు ఈ అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఇక అనేక పరిణామాల అతడిని విడుదల చేయాల్సిందిగా ఎస్సార్బీ సూచించడంతో అతడు మూడేళ్ల ముందుగానే బయటకు వచ్చాడు. కాగా మను శర్మ కాంగ్రెస్ నేత వినోద్ శర్మ కుమారుడన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment