విమానాన్ని ఢీకొట్టిన బస్సు
కోల్ కతా: కోల్ కతా విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగిఉన్న ఎయిర్ ఇండియా విమానాన్ని జెట్ ఎయిర్ వేస్ కు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో విమానం కొంత భాగం ధ్వంసమైంది. ఆ సమయంలో విమానంలో ప్రయాణీకులు లేరు. ఈ ఘటన తెలిసి ఒక్కసారిగా విమానాశ్రయ అధికారులు ఉలిక్కి పడ్డారు.
ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణీకులకు ఎలాంటి ప్రాణనష్టంగానీ, గాయాలవడంగానీ చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. బస్సులో ప్యాసింజర్స్ను విమానం వద్దకు తీసుకెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల విమానాశ్రయంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ వల్లే ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదానికి గురైన విమానం అసోంలోని సిల్చార్ కు వెళ్లాల్సి ఉంది. బస్సు డ్రైవర్ ను ప్రశ్నిస్తున్నారు.