ముంబైకి చేరిన బ్రస్సెల్స్ దాడి బాధితురాలు
ముంబైః బ్రసెల్స్ ఎయిర్ పోర్టులో జరిగిన టెర్రర్ దాడిలో గాయపడ్డ జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగిని నిధి ఛాపేకర్ ముంబై చేరుకున్నారు. గాయాలనుంచి కొంతశాతం కోలుకోవడంతో ఆమె శుక్రవారం ఉదయం ముంబైకి తిరిగి వచ్చారు. చీలమండ విరిగి, 15 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందిన నిధి.. స్కిన్ గ్రాఫ్టింగ్ చికిత్స చేయించుకున్నారు. ఆమెతోపాటు జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది అమిత మోత్వానీ ఇంకా బ్రస్సెల్స్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.
మార్చి నెలలో బ్రసెల్స్ విమానాశ్రయంలో జరిగిన ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి, అక్కడే ఆస్పత్రిలో చికిత్స పొందిన జెట్ ఎయిర్ వేస్ క్రూ మెంబర్ నిధి ఛాపేకర్ ముంబై చేరుకున్నారు. 42 ఏళ్ళ నిధి ఇంకా కొంతశాతం గాయాలనుంచీ కోలుకోవాల్సిన అవసరం ఉండటంతో పారిస్ నుంచి జెట్ ఎయిర్ వేస్ విమానంలో ముంబై చేరగానే, ఎయిర్ పోర్టునుంచే ఆమెను ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. ఆమె కొంత రక్తహీనతతో బాధపడుతున్నారని, ఇంకా కొన్ని రోజులు ఆమె విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఎక్కువగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉండటం మంచిదని డాక్టర్లు తెలిపారు.
1996 ఆగస్టు నుంచి జెట్ ఎయిర్ వేస్ లో పనిచేస్తున్న నిధి ఛాపేకర్... మార్చి 22న బ్రసెల్స్ ఎయిర్ పోర్టునుంచి జెట్ ఎయిర్ వేస్ ఫ్లైట్ లో న్యూయార్క్ వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో జరిగిన దాడితో ఆమె శరీరానికి 15 శాతం గాయాలు అవ్వడంతోపాటు, చీలమండ విరిగిపోయింది. అప్పట్నుంచీ బ్రసెల్స్ కు దగ్గరలోని గ్రాండె హాస్పిటల్ డి చెలేరియోలో 25 రోజులపాటు చికిత్స పొందిన ఆమె... గురువారం సాయంత్రం ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యి, అక్కడినుంచి పారిస్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం పారిస్ నుంచి ముంబైకి చేరారు. నిధి.. ఇప్పటికీ వీల్ ఛైర్ ఆధారంగానే కదలాల్సిన పరిస్థితి ఉండటంతో ఆమె భర్త రూపేష్ ఛాపేకర్, అతని సోదరుడు నీలేష్ ఛాపేకర్ ఎయిర్ పోర్టునుంచి, ఎయిర్ లైన్స్ సిబ్బంది, వైద్యాధికారుల సహాయంతో బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి చేర్చారు.