రాంచి: ఒకవైపు మండే ఎండలు జనం గుండెల్లో దడ పుట్టిస్తోంటే మరోవైపు జార్ఖండ్లో వానల కోసం ఓ వ్యక్తిని బలి ఇచ్చిన సంఘటన ప్రకంపనలు రేపింది. రాజధాని రాంచికి సమీపంలోని గుల్మా జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. ఇంట్లోకి చొరబడిన కొంతమంది దుండగులు ఒంటరిగా ఉన్న 55 సంవత్సరాల థెపా ఖారియాపై దాడిచేసి, హత్య చేసి తలను ఎత్తుకపోయారని పోలీసులు తెలిపారు.
సీనియర్ పోలీస్ ఆఫీసర్ అజయ్ కుమార్ ఠాకూర్ సోమవారం అందించిన సమాచారం ప్రకారం.. ఒంటరిగా నివసించే థెపా ఆదివారం మార్కెట్కు రాకపోవడంతో.. అనుమానం వచ్చిన ఇరుగు పొరుగువారు, ఇంటిని తలుపులు పగలగొట్టి చూడగా రక్తపు మడుగులో పడివున్న అతని మొండెం కనిపించింది. దీంతో షాక్కు గురైన వారు పోలీసులకు సమాచారం అందించారు.
మనిషి తలను వరి పొలాల్లో తగులబెడితే విస్తారమైన వానలు కురుస్తాయనీ, మంచి పంటలు పండుతాయనే మూఢ నమ్మకంతోనే కొంతమంది దుండగులు ఖారియాను హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ దురాచారాన్ని ప్రశ్నించేవాళ్లు లేరని, వాళ్లు ఎవరినయినా చంపుతారనీ, అనాదిగా జరుగుతున్న ఈ అకృత్యాన్ని అడ్డుకునేవారు లేకపోయారని సోదరుడు జత్రూ ఆవేదన వ్యక్తం చేశారు.
చాలా మంది గ్రామస్తులు ఇలా బలి ఇవ్వడానికి పవిత్రంగా భావిస్తుండగా... హతుని బంధువులు మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
మండుతున్న ఎండలు జార్ఖండ్లో మరింత తీవ్రంగా ఉన్నాయి. స్థానికంగా అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. మరోవైపు జూన్ రెండవ వారం వరకూ రుతుపవనాల రాక ఆలస్యం కావటంతో వానలు కురిసే అవకాశం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే గ్రామంలోని కొంతమంది వ్యక్తులు ఈ దారుణానికి తెగబడ్డారని సమాచారం. కాగా జార్ఖండ్లో 2012 , 2013 సంవత్సరాల్లో ఇలాంటి సంఘటనలు నమోదైనట్టు తెలుస్తోంది.
వర్షాల కోసం నరబలి?
Published Mon, Jun 1 2015 12:25 PM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM
Advertisement
Advertisement