బీహార్ సీఎంగా మంజి ప్రమాణం
23న విశ్వాస పరీక్ష
పాట్నా: బీహార్ 32వ ముఖ్యమంత్రిగా జితన్ రామ్ మంజి మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. 17 మంత్రులతో పాటు సీఎంగా మంజితో గవర్నర్ డీవై పాటిల్ ఇక్కడి రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. 23న ఆయన అసెంబ్లీ విశ్వాసాన్ని పొందాలని గవర్నర్ ఈ సందర్భంగా సూచించారు. తాజాగా మంత్రి పదవులు చేపట్టిన వారందరూ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేబినెట్‌లో మంత్రులుగా పనిచేశారు. ఆ మంత్రివర్గంలో ఒక మహిళ ఉన్నారు.
కూలీ బిడ్డ నుంచి సీఎం పీఠం వరకూ...
మహాదళిత్ వర్గానికి చెందిన జితన్ రామ్ మంజి 1944 అక్టోబర్ 6న గయ జిల్లాలోని మహకార్ గ్రామంలో పుట్టారు. ఆయన తండ్రి రామ్‌జిత్ రామ్ వ్యవసాయ కూలి. జితన్‌కు చదువుకోవాలని కోరిక ఉన్నా భూస్వాముల ఒత్తిడితో చిన్నతనంలోనే తండ్రితో కలసి పొలంలో వెట్టిచాకిరీ చేయక తప్పేదికాదు. అయితే తండ్రి, భూస్వామి కొడుకు కోసం నియమించిన ట్యూటర్ సహాయంతో ఆయన బడికి వెళ్లకుండానే 7వ తరగతి పూర్తిచేశారు. ఆ తర్వాత హైస్కూల్‌లో చేరి చదువును కొనసాగించి చరిత్రలో డిగ్రీ పూర్తిచేశారు.
1968లో తపాలా శాఖలో గుమస్తా ఉద్యోగం పొందిన ఆయన, 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది ఫతేపూర్ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టి సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రస్తుతం జెహానాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్ రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సీనియర్ నేతకు కాంగ్రెస్, ఆర్‌జేడీ, జేడీ (యూ) పార్టీల ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన అపార అనుభవం ఉంది. ఈ ఏడాది లోక్‌సభకు పోటీ చేసిన మంజి తన ఎన్నికల అఫిడవిట్‌లో స్థిరచరాస్తులు కేవలం రూ. 2.83 లక్షలుగా పేర్కొని తానెంత సామాన్యుడో చెప్పకనే చెప్పారు.
రబ్బర్ స్టాంప్‌ను కాదు..
అంతకుముందు మాజీ సీఎం నితీశ్ కుమార్ చేతిలో కీలుబొమ్మ అనే విమర్శను మంజి తిప్పికొట్టారు. తనను రబ్బ ర్ స్టాంప్ అని చెప్పడం ద్వారా బీజేపీ తన దళిత వ్యతిరేకతను బయటపెట్టుకుంటోందని మంజి విమర్శించారు. అయితే నితీశ్ కుమార్ సూచనలు తీసుకోవడాన్ని కొనసాగిస్తానని వెల్లడించారు. కాగా, జేడీయూ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ డీవై పాటిల్‌కు లేఖ రాసింది. దీంతో 239 సీట్ల అసెంబ్లీలో ప్రస్తుతం జేడీయూ ప్రభుత్వ బలం 124కు చేరింది. మరోపక్క బీజేపీ అసంతృప్త ఎమ్మెల్యేలు ఇద్దరు రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీలో ఆ పార్టీ బలం 88కి పడిపోయింది.