బెంగళూరు: ఇప్పటివరకు చూసిన మోసాలన్నీ ఒక ఎత్తయితే, టీచర్ ఉద్యోగాలు ఇస్తామని ఓ ముఠా చేసిన మోసం ఒక ఎత్తు! ఒక్క బెంగుళూరులోనే కాదు దేశమంతటా ఈ గ్యాంగ్ బాధితులన్నారంటే ఆలోచించండీ.. వాళ్లు తడి గుడ్డతో గొంతు ఎలా కోయడంలో ఎంత సిద్ధహస్తులో.
'ఎస్ రాధాకృష్ణన్ ఆల్ ఇండియా టీచర్స్ ఎగ్జామినేషన్' పేరుతో దేశవ్యాప్తంగా కొత్తగా ప్రారంభించనున్న స్టడీ సెంటర్లలో టీచర్లు కావాలని ఆన్ లైన్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 7వ తరగతి వరకు బోధించాల్సి ఉంటుందని, విద్యార్ధులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికే ఈ పరీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. వేతనం సంవత్సరానికి రూ.4.15 లక్షల నుంచి 8.2 లక్షల వరకూ ఉంటుందని తెలిపారు. మొత్తం మూడు కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి కోరిన వాళ్లు రెండింటికి డిగ్రీ, ఒకదానికి పీజీని విద్యార్హతలుగా పేర్కొన్నారు. పరీక్ష రాయడానికి 45 ఏళ్ల వయసు మించకూడదని నోటిఫికేషన్ లో వివరించారు. పరీక్ష ఫీజు కింద రూ.1,600 చెల్లించి చలానాను పరీక్ష హాలుకు తీసుకొని రావాలని తెలిపారు.
ఈ నోటిఫికేషన్ ను నమ్మి దాదాపు 1,000 మంది బెంగుళూరు వాసులు పరీక్ష రాయడానికి ఫీజును చెల్లించారు. గత ఆదివారం పరీక్ష నిర్వహిస్తామని, జయానగర్ లోని ఎమ్ ఈఎస్ పాఠశాలలో పరీక్ష ఉంటుందని చెప్పారు. మొత్తం అభ్యర్థులను రెండు భాగాలుగా చేసి 500 మందికి గత ఆదివారం మిగతా 500 మందికి వచ్చే ఆదివారం పరీక్ష తేదీగా తెలిపారు. దీంతో ఈ విషయాన్ని నమ్మి ఉదయాన్నే స్కూల్ వద్దకు 500 మంది పరీక్షకు వచ్చారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో.. ఇవేం ఏర్పాట్లని తొలుత చిరాకుపడినా, తర్వాత తేరుకుని మోసపోయినట్లు తెలుసుకుని గగ్గోలు పెట్టారు.
దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటకు వచ్చింది. ఈ ముఠా పక్కా ప్లాన్ ప్రకారం మోసం చేసిందని కేసును విచారిస్తున్న బెంగుళూరు సౌత్ డీసీపీ లోకేష్ కుమార్ తెలిపారు. ఎక్కువ మొత్తంలో డబ్బును తీసుకోకుండా చిన్న మొత్తాల్లో దాదాపు రూ.16 లక్షలు టోకరా పెట్టిందని వివరించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఏకంగా వెబ్ సైట్ ను తప్పుడు వివరాలతో తయారు చేశారని తెలిపారు.
పరీక్ష ఫీజు పేరుతో దోచేశారు!
Published Mon, May 16 2016 9:22 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM
Advertisement
Advertisement