జైల్లోనే ఛోటా రాజన్ హత్యకు 'ఢీ' గ్యాంగ్ స్కెచ్!
న్యూఢిల్లీ:
తీహార్ జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్ను హత్య చేసేందుకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఛోటా షకీల్ గ్యాంగ్ పన్నిన కుట్రను పోలీసులు మరోసారి చేధించారు. ఛోటా షకీల్ గ్యాంగ్ సభ్యుడు జునైద్ చౌదరిని ఈశాన్య ఢిల్లీలోని వజీరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. 21 ఏళ్ల జునైద్ చౌదరి ఇండియా మోస్ట్ వాంటెడ్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంలా టాప్ గ్యాంగ్‌స్టర్ కావాలనుకుంటున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
పాకిస్తాన్‌లో జన్మించి కెనేడియన్ రచయితగా స్థిరపడ్డ తారెక్ ఫతా హత్యకు కుట్రపన్ని జునైద్ చౌదరి పోలీసులకు చిక్కాడు. అయితే ఈ హత్యతోనే మరో హత్యకు కుట్రపన్నాడు జునైద్. ఇప్పటికే గత ఏడాది ఛోటా రాజన్ను కోర్టుకు తీసుకెళ్లే సమయంలో చంపాలని జునైద్ పథకం రచించి విఫలమయిన విషయం తెలిసిందే. రాజన్ను చంపేందుకు జునైద్తో పాటూ నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లు రాబిన్సన్, యూనిస్, మనీశ్లను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.
అయితే ఈ సారి మాత్రం ముందుగా ఫతాను హతమార్చి పోలీసులకు చిక్కితే నేరుగా తీహార్ జైలుకెళ్లొచ్చని స్కెచ్ గీశాడు. దీంతో జైల్లోనే చోటా రాజన్‌ని మట్టుపెట్టొచ్చని ప్లాన్ వేశాడు. టెర్రరిజమ్ ఖండిస్తూ ఫతా పలుమార్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఫతాని అంతమొందిచాలని జునైద్ భావించాడని డీసీపీ(స్పెషల్ సెల్) పీఎస్ కుష్‌వా తెలిపారు. ఫతా ఢిల్లీ రానున్న నేపథ్యంలో జునైద్ రెక్కీ నిర్వహిస్తూ పోలీసులకు చిక్కాడు. ఈశాన్య ఢిల్లీలోని గోకాల్‌పురీ ప్రాంతంలోని భాగీరథి విహార్‌కు చెందిన ఓ పాల వ్యాపారి కుమారుడు జునైద్.