తదుపరి సీజేఐ జస్టిస్‌ బాబ్డే | Justice Bobde Will Take Oath As CJI On 18th November | Sakshi
Sakshi News home page

తదుపరి సీజేఐ జస్టిస్‌ బాబ్డే

Published Wed, Oct 30 2019 12:32 AM | Last Updated on Wed, Oct 30 2019 7:52 AM

Justice Bobde Will Take Oath As CJI On 18th November - Sakshi

నియామకపత్రాన్ని జస్టిస్‌ బాబ్డేకు అందిస్తున్న ప్రధాన మంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీకే మిశ్రా

న్యూఢిల్లీ: కీలకమైన పలు కేసులను విచారిస్తున్న జస్టిస్‌ శరత్‌ అరవింద్‌ బాబ్డే(63) సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్‌ బాబ్డే నవంబర్‌ 18వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2021 ఏప్రిల్‌ 23 వరకు అంటే 17 నెలల పాటు జస్టిస్‌ బాబ్డే పదవిలో కొనసాగుతారు. సుప్రీంకోర్టులో సీనియారిటీ ప్రకారం జస్టిస్‌ బాబ్డే రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుత చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ పదవీకాలం నవంబర్‌ 17వ తేదీతో ముగియనుంది.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 1956 ఏప్రిల్‌ 24న బాబ్డే జన్మించారు. ఈయన తండ్రి ప్రముఖ న్యాయవాది అరవింద్‌ శ్రీనివాస్‌ బాబ్డే. నాగపూర్‌ యూనివర్సిటీ నుంచే బీఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1978లో బాబ్డే మహారాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా చేరారు. బాంబే హైకోర్టులో 21 ఏళ్లు పనిచేశారు. 1998లో ఆయన్ను సీనియర్‌ న్యాయవాదిగా నియమించారు. 2000లో బోంబే హైకోర్టు అడిషనల్‌ జడ్జిగా, 2012లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 ఏప్రిల్‌ 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

కీలక తీర్పుల్లో జస్టిస్‌ బాబ్డే
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం గోప్యత పౌరుడి ప్రాథమికహక్కు అంటూ 2017లో చారిత్రక తీర్పునిచ్చిన తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనంలో జస్టిస్‌ బాబ్డే కూడా ఒకరు. జస్టిస్‌ బాబ్డే సహా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని 9 మంది సభ్యుల ధర్మాసనం గోప్యత హక్కుకు రాజ్యాంగం రక్షణ కల్పించిందని వ్యాఖ్యానించింది. దేశ పౌరులెవరూ కూడా ఆధార్‌ కార్డు లేని కారణంగా కనీస సదుపాయాలను గానీ, ప్రభుత్వ సేవలకూ గానీ దూరం కారాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాలుష్యాన్ని వెదజల్లుతోన్న టపాసులను కాల్చడాన్ని పూర్తిగా నిషేధించాలన్న వాదనను ఈ ఏడాది మార్చిలో జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.

కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. రాజకీయంగా అత్యంత సున్నితమైన రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదం కేసును విచారిస్తోన్న ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్‌ బాబ్డే కూడా ఉన్నారు. యావద్దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఈ కేసుపై సుప్రీంకోర్టు నవంబర్‌ 15న తుదితీర్పును వెలువరించనుంది. ఆ తరువాత రెండు రోజులకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ పదవీ విరమణ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement