కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు జస్టిస్ కర్ణన్‌ను తీసుకొచ్చిన దృశ్యం
బెయిల్‌కు, జైలుశిక్ష రద్దుకూ నో
న్యూఢిల్లీ/కోల్‌కతా: కోర్టు ధిక్కార నేరంపై అరెస్టయిన కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌ను బుధవారం కోల్‌కతా జైలుకు తరలించారు. మంగళవారం కోయంబత్తూరు దగ్గర్లోని ఓ రిసార్టులో అరెస్టుచేసిన పశ్చిమబెంగాల్ సీఐడీ పోలీసులు ఆయన్ను ఎయిర్‌ఇండియా విమానంలో కోల్‌కతా విమానాశ్రయానికి తీసుకొచ్చి అక్కడి నుంచి నేరుగా ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోం(జైలు)కు తరలించారు. ఆరువారాలపాటు కనిపించకుండాపోయిన ఆయనకు జైలు శిక్షకు సంబంధించి సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి తాత్కాలిక ఉపశమనాలు లభించలేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
అలాగే కోర్టు ధిక్కార నేరానికిగానూ విధించిన ఆరు నెలల జైలు శిక్షను రద్దు చేయాలన్న విజ్ఞప్తిని సైతం తిరస్కరించింది. ఈ అంశాన్ని ఏడు గురు న్యాయమూర్తుల ధర్మాసనం పరిశీలించి తీర్పు ఇచ్చిందని, ఆ తీర్పునకు తాము కట్టుబడి ఉండాలని, వెకేషన్ బెంచ్ అయిన తాము ఈ తీర్పును తోసిపుచ్చలేమని, ఈ అంశంపై తాము ఏమీ చేయలేమని వెకేషన్ బెంచ్ జడ్జీలు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌కే కౌల్ స్పష్టం చేశారు. కోర్టు తిరిగి ప్రారంభమయ్యే వరకూ బెయిల్ మంజూరు చేయాలని కర్ణన్ తరఫు న్యాయవాది మాథ్యూ నెడుంపరా కోర్డును కోరారు. ఈ అంశాన్ని చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఎదుట ప్రస్తావించాలని న్యాయస్థానం సూచించింది.
జైలులో కర్ణన్‌కు ఛాతీ నొప్పి: జైలుకు తరలించిన కొద్దిసేపటికే ఛాతీ నొప్పి వస్తోందని కర్ణన్ చెప్పడంతో ఆయనకు జైలు ఆస్పత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వృద్ధాప్యం కారణంగా కర్ణన్ కాస్త అనారోగ్యంతో ఉన్నారని, ఆయనకు ఈసీజీ తీశామని, వైద్య నివేదికల్లో తేడా ఉంటే ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తామని అధికారులు చెప్పారు.