సాక్షి, న్యూఢిల్లీ: పదవీ బాధ్యతల్లో ఉన్న రాజస్తాన్ గవర్నర్ కళ్యాన్ సింగ్‌ను తొలగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పద బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో కళ్యాన్ సింగ్ విచారణను ఎదుర్కొంటున్నారు. 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీలు క్రిమినల్ కుట్రకు పాల్పడినట్టు అభియోగాలు మోపబడ్డ విషయం తెలిసిందే. 2001లో సీబీఐ కోర్టు కుట్ర అభియోగాల నుంచి ఈ ముగ్గురు నేతలకు విముక్తి కల్పించింది. ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టు ఏడేళ్ల కిందట సమర్థించగా.. 2017లో సుప్రీంకోర్టు అద్వానీ, జోషి, ఉమాభారతిలపై అభియోగాల ఎత్తివేత కుదరదని, ఈ అభియోగాలపై విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేయడంతో బాబ్రీ అంశం మరలా తెర మీదకి వచ్చింది.
విచారణకు కళ్యాన్‌సింగ్..
అయితే బాబ్రీ దుర్ఘటన సమయంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాన్ సింగ్ పేరును కూడా చార్జ్‌షీట్‌లో చేర్చిన సీబీఐ సుప్రీం ఆదేశాలతో విచారణను మరింత వేగవంతం చేసింది. కేసు విచారణలో భాగంగా కళ్యాన్ సింగ్‌ను కూడా సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన గవర్నర్ పదవిలో ఉండటంతో విచారణకు అడ్డు వస్తుందన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పదవి నుంచి తొలగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 ప్రకారం నేర విచారణను ఎదుర్కొంటున్న గవర్నర్లను తప్పించే అధికారం రాష్ట్రపతి ఉంటుంది.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై త్వరలోనే సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్నట్లు, కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు రాకుండా ముందస్తుగా ఆయన స్థానంలో మరొకరిని నియమించినట్లు సమాచారం. కాగా 1992 డిసెంబర్6న హిందూ సంఘాలు బాబ్రి మసీదును కూల్చివేసిన సమయంలో కళ్యాన్ సింగ్ ప్రభుత్వం వారికి సహకరించిందని ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది.
గవర్నర్‌ల నియామకంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కల్‌రాజ్ మిశ్రాను రాజస్తాన్‌కు బదిలీ చేసింది. అలాగే తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment