
సీఎం రాజీనామా చేయాలి
కమల్ హాసన్ డిమాండ్
చెన్నై: తమిళనాడు సీఎం కె.పళనిస్వామి అవినీతిలో కూరుకుపోయారని ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేయాలని నటుడు కమల్ హాసన్ మంగళవారం పరోక్షంగా డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆసుపత్రిలో 60 మందికిపైగా చిన్నారులు మరణించగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. ఈ అంశాన్ని ప్రస్తావించిన కమల్ ‘ఓ రాష్ట్రంలో దుర్ఘటన జరిగితే సీఎం రాజీనామా చేయాలని కోరుతున్నారు. కానీ తమిళనాడులో ఏ పార్టీ కూడా రాజీనామాకు డిమాండ్ చేయడం లేదు. చేయాల్సినన్ని నేరాలు చేశారు’ అని ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై సీఎం, మంత్రులు మండిపడ్డారు.
ఆరోపణలకు కమల్ ఆధారాలను చూపించాలన్నారు. కమల్ రాజకీయాల్లో చేరితే ఆయనకు ప్రభుత్వం నుంచి స్పందన అందుతుందని పళనిస్వామి పేర్కొన్నారు. ‘సమాజానికి నువ్వేం చేశావ్’ అని కొందరు మంత్రులు కమల్‌ను ప్రశ్నించారు. అనంతరం అవినీతిపై సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు నమోదు చేయాల్సిందిగా కమల్ తన అభిమానులను కోరారు. అవినీతి నుంచి స్వాతంత్య్రం లేకుంటే మనమంతా బానిసలమేననీ, ధైర్యమున్నవారు కొత్త స్వాతంత్య్రోద్యమం కోసం సంకల్పం తీసుకోవాలనీ, గెలుపు సాధిస్తామని కమల్ తన తర్వాతి ట్వీట్లలో పేర్కొన్నారు.