చెన్నై : అమ్మ(జయలలిత) ఫోటోలను పాకెట్‌లో పెట్టుకు తిరిగే మీరు మహిళల రక్షణకు తీసుకునే చర్యలేంటని తమిళనాడు మంత్రులను ప్రశ్నిస్తున్నారు కమల్ హాసన్. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పొల్లాచ్చి సెక్స్ రాకెట్ కేసు విషయంలో అధికార పార్టీ మంత్రులు మౌనంగా ఉంటడం పట్ల కమల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కేసులో ఫిర్యాదు చేసిన మహిళ పేరును కోయంబత్తూరు ఎస్పీ వెల్లడించారు. కానీ ప్రభుత్వం సదరు ఎస్పీ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బాధితులకు సంబంధించిన వీడియోలు ఎలా లీక్ అయ్యాయి. వీటన్నింటికి సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా ఉందం’టూ కమల్ ప్రశ్నించారు.
అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం బాధితుల పేర్లను వెల్లడించి వారిని అవమానిస్తుందంటూ కమల్ హాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసులో అరెస్టయిన వారిలో అధికార పార్టీకి చెందిన నాగరాజు అనే వ్యక్తి బెయిల్ మీద విడుదలవ్వడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ కేసులో డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి జయరామన్ కుటుంబీకులకు సంబంధాలు ఉన్నాయంటూ గత మూడు రోజులుగా వార్తాచానళ్లలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తలను జయరామన్ ఖండించారు. ఇదిలా ఉండగా ఈ భారీ సెక్స్ రాకెట్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఆమోదం తెలిపారు. ప్రసుత్తం ఈ కేసును సీబీసీఐడీ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇక పొల్లాచ్చి అత్యాచారాలకు నిరసనగా విద్యార్థి లోకం గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఆందోళనలు గురువారం తీవ్రరూపం దాల్చాయి. చెన్నై, పొల్లాచ్చి, కోయంబత్తూరు, కరూరు, తంజావూరు, వేలూరు తదితర నగరాల్లో విద్యార్థులు పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు జరిపారు. విద్యార్థి సంఘాలన్నీ ధర్నాలు, రాస్తారోకో జరపటంతో ఆ నగరాలన్నీ దద్దరిల్లిపోయాయి. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి పరిసర ప్రాంతాల్లో మాయమాటలతో మోసపుచ్చి 200లకు పైగా పాఠశాల, కళాశాల విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడిన నలుగురు సభ్యులున్న ముఠాను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment