చెన్నై: కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ వైఖరిని తాను ఖండిస్తున్నానని ప్రముఖ నటుడు,మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న నూతన విద్యావిధానంపై నటుడు సూర్య చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. నీట్ పరీక్షా విధానాన్ని విమర్శించిన సూర్యపై బీజేపీ సహా అన్నాడీఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కమల్ హాసన్ ఆయనకు అండగా నిలిచారు. సూర్య కుటుంబం విద్యాభివృద్దికి ఎంతో కృషి చేసిందని.. వారికి విద్య గురించి మాట్లాడే హక్కు ఉందని తెలిపారు. కాగా చెన్నైలో తన ఫౌండేషన్ కార్యక్రమంలో సూర్య మాట్లాడుతూ హిందీని మూడో భాషగా చేర్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో, ప్రవేశ పరీక్షలకు సమాయత్తం చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.విద్యార్థులు హిందీ భాషను నేర్చుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, నేను సైతం నా పిల్లలకు బోధించలేక పోతున్నానని వాపోయారు.
కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్ మీడియాతో మాట్లాడుతూ అందరికీ విద్యను అందించాలని, అదీ సమతుల్యమైన విద్యగా ఉండాలనే కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని తీసుకొస్తోందన్నారు. అయినా తమిళనాడులో ఆ విధానాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. మరో విషయం ఏమిటంటే విద్యా విధానం గురించి తెలియనివారు కూడా దాని గురించి మాట్లాడుతున్నారని సూర్యపై ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment