విశ్వాసపాత్రుడే తిరుగుబాటు చేస్తే!
యోగేంద్ర యాదవ్, ప్రశాంత భూషణ్ లాంటి అత్యంత విశ్వాసపాత్రులు కూడా ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బయటకు వచ్చేసిన తరుణంలో సైతం అరవింద్ కేజ్రీవాల్‌ను వెన్నంటి ఉండి, ఆయనకు అత్యంత నమ్మకస్తుడిగా పేరొందిన నాయకుడు.. కపిల్ మిశ్రా. అన్నాహజారే మొదలుపెట్టిన అవినీతి రహిత భారతం ఉద్యమంలో పాల్గొన్న యువకుల్లో ఒకరు. అప్పటినుంచి కేజ్రీవాల్‌కు బాగా సన్నిహితంగా మెలిగిన మిశ్రా.. ఇప్పుడు ఆయనపైనే బాంబులు పేలుస్తున్నారు. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి రూ. 2 కోట్ల లంచం తీసుకుంటుండగా తాను ప్రత్యక్షంగా చూశానంటూ ప్రకటించి ప్రకంపనలు సృష్టించారు. ఇప్పటికే అవినీతి నిరోధక శాఖకు తనవద్ద ఉన్న ఆధారాలు సమర్పించిన మిశ్రా, ఆ తర్వాత సీబీఐ తలుపు కూడా తట్టారు. వాటర్ ట్యాంకర్ స్కాం గురించి రెండు విభాగాలకు ఫిర్యాదు చేశారు. కపిల్ మిశ్రా చేసిన ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ చీఫ్ ముకేష్ మీనా తక్షణం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయానికి వెళ్లారు. కింకర్తవ్యం అంటూ ఆయనను అడిగారు. ముఖ్యమంత్రి మీద విచారణ జరిపించాలా.. ఆగాలా అనే సంశయంలో ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సీబీఐ చేతికి కూడా కేసు వెళ్తే.. ఇక ఎటూ ఆ సంస్థ చూసుకుంటుందిలే అన్న నమ్మకం కూడా కనిపిస్తోంది.
కొన్ని రోజుల వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీలోని ప్రముఖ నాయకుల్లో ఒకరిగా పేరొందిన మిశ్రాను ఇప్పుడు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా బీజేపీ ఏజెంటు అంటూ తిట్టిపోస్తున్నారు. తరచు పత్రికల హెడ్‌లైన్లలో ఉండే విధంగా కామెంట్లు చేయడంలో కపిల్ మిశ్రా సిద్ధహస్తుడు. ఆయన ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేశారు. 36 ఏళ్ల వయసులో అన్నాహజారే ఉద్యమంలో చేరారు. ఢిల్లీలో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల స్కాంపై కామన్ vs వెల్త్ అంటూ ఓ పుస్తకం సైతం రాశారు. ప్రతిసారీ కేజ్రీవాల్‌ను కాపాడుతూ ప్రకటనలు చేసేవారు. యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లాంటివాళ్లు పార్టీ వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు చేసిన ఆరోపణలను గట్టిగా ఖండించింది కూడా ఆయనే. న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్‌ను నకిలీ సర్టిఫికెట్ కేసులో అరెస్టు చేసిన తర్వాత న్యాయశాఖను మిశ్రానే నిర్వహించారు. కొన్నాళ్ల తర్వాత ఆ శాఖను తీసేశారు. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మీద తిరుగుబాటు చేయడానికి మిశ్రాకు మనసొప్పింది.