కపిల్ కొత్త షో లో నరేంద్ర మోదీ?
ముంబై: 'ద కపిల్ శర్మ షో' అంటూ త్వరలో టీవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నటుడు కపిల్ శర్మ బుర్రలో ఓ కొత్త ఐడియా తళుక్కుమంది. కొత్తదనం కోసం పరితపిస్తున్న ఆయన తాను చేస్తున్న తన కొత్త కామెడీ షోలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూడాలనుకుంటున్నాడట. 'కామెడీ నైట్స్ విత్ కపిల్' అంటూ నిన్నమొన్నటి వరకు టీవీ ఛానల్ లో బాలీవుడ్ ప్రముఖులు, స్పోర్ట్స్ సెలబ్రిటీలను ఆహ్వానించి ఆకట్టుకున్న కపిల్ శర్మ తన కొత్త షోలో రాజకీయ నాయకులతో కూడా హల్చల్ చేయనున్నాడట. ఈ నేపథ్యంలో మోదీ జీవితంలోని స్ఫూర్తివంతమైన కోణాన్ని ప్రజలకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాడట. తద్వారా రాజకీయ ప్రముఖులకు, ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండాలని కోరుకుంటున్నానని కపిల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ఇటీవల అమెరికాలోని ఓ టీవీ షోలో (ఎల్లెన్ డేజనెర్స్) బరాక్ ఒబామాను చూసిన తరువాత కపిల్ మదిలో ఈ ఆలోచన వచ్చిందట. మోదీ జీవితంలోని గొప్పఅంశాలను తనకు చాలా ప్రేరణనిచ్చాయని, ఆయనతో మాట్లాడి, నిర్ణయం తీసుకుంటానన్నాడు. అయితే ఈ షోలో రాజకీయాలు, పార్టీ వ్యవహరాలకు చోటు ఉండదట. కేవలం స్ఫూర్తివంతమైన ఆయన రాజకీయ జీవితాన్ని ప్రేక్షకులకు అందించాలన్నదే తన ఉద్దేశమంటున్నాడు. ఒక మారుమూల గ్రామం నుంచి, దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన మోదీ రాజకీయ ప్రస్థానం ద్వారా ఇతరులకు ప్రేరణ కలిగించాలని భావిస్తున్నట్లు కపిల్ శర్మ తెలిపాడు. మరోవైపు సహనటుడు కృష్టతో విభేదాలంటూ వచ్చిన వార్తలను కపిల్ ఖండించాడు. అలాంటిదేమీ లేదని ఇద్దరం కలిసి ఓ షో చేయబోతున్నట్లు అతడు స్పష్టం చేశాడు.
కాగా పాపులర్ హిందీ కామెడీ షో 'కామెడీ నైట్స్ విత్ కపిల్' వ్యాఖ్యాత కపిల్ శర్మ ఇప్పుడు మరో కొత్త కామెడీ షోతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 23 నుంచి శని, ఆదివారాలలో తొమ్మిది గంటలకి ప్రసారంకానున్నీ షో ప్రమోషన్ కోసం ఢిల్లీ, లక్నో, భోపాల్, అమృత్ సర్ లాంటి ప్రముఖ నగరాలలో లైవ్ పెర్‌ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.