నేనూ బడి దొంగనే: కరీనా
న్యూఢిల్లీ: చిన్నప్పుడు తానూ బడిదొంగనేనని చెబుతోంది బాలీవుడ్ నటి కరీనాకపూర్. భారత్‌లో యూనిసెఫ్ ప్రచారకర్త అయిన కరీనా.. చదువులో కూడా తాను ఏమంత గొప్ప మార్కులేమీ తెచ్చకునేదాన్ని కాదంటోంది. చైల్డ్ ఫ్రెండ్లీ స్కూల్ అండ్ సిస్టమ్(సీఎఫ్‌ఎస్‌ఎస్) ప్యాకేజీని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరీనా తన చిన్ననాటి జ్ఞాపకాలను మీడియాతో పంచుకుంది.
‘చిన్నప్పుడు స్కూల్‌కు వెళ్లమంటే మారాం చేసేదాన్ని. స్కూళ్లో కూడా ముందు బెంచీలో కూర్చోవాలంటే భయం. స్కూల్‌కు పంపేందుకు అమ్మ ఉదయం 6 గంటలకే నిద్ర లేపేది. అమ్మా.. ఇంకొక్క గంట పడుకుంటానమ్మా అని బతిమాలేదాన్ని. నాకు పదేళ్లు వచ్చేసరికి నా బ్యాగ్ బరువు చాలా పెరిగింది. అంత బరువున్న బ్యాగును మోసుకుంటూ స్కూలుకు వెళ్లి తరగతి గదిలో నిద్రపోయేదాన్ని. బ్యాగు మోసి అలసిపోవడమే కారణమేమో... తరగతి గదిలోకి వెళ్లగానే నిద్ర వచ్చేది. దీంతో టీచర్లు చెప్పిన పాఠాలు బుర్రకు ఎక్కేవి కావు. ఫలితంగా మార్కులు కూడా అంతంత మాత్రంగానే వచ్చేవి.
ముందు బెంచ్‌లో కూర్చున్నవారు మాత్రం పాఠాలను శ్రద్ధగా వినేవారు. దీంతో వారికి మార్కులు కూడా బాగానే వచ్చేవి. దీంతో నాకు ఏదోలా అనిపించేది. ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చిన రోజు ఇంటికి వెళ్లి అమ్మతో అనేదాన్ని... అమ్మా ఇకపై నేను ఇంట్లోనే కూర్చొని చదువుకుంటానని..! ఇలాంటివి పాఠశాల చదువుకు సంబంధించి ఎన్నో జ్ఙాపకాలున్నాయి. వాటిని ఇప్పుడు గుర్తుచేసుకుంటే సంతోషంగా అనిపిస్తుంద’ని చెప్పింది.
ఇక సీఎఫ్‌ఎస్‌ఎస్ గురించి మాట్లాడుతూ... కష్టపడి కాకుండా ఇష్టపడి చదివేలా విద్యావిధానంలో మార్పులు రావాలని తాను ఆశిస్తున్నానని చెప్పింది. సీఎఫ్‌ఎస్‌ఎస్ ప్యాకేజీని కూడా ఇదే ఉద్దేశంతో ప్రారంభిస్తున్నారని పేర్కొంది. రాజస్థాన్‌లో ఇటువంటి పాఠశాలలను తాను సందర్శించానని, అక్కడి పిల్లలను చూస్తే మళ్లీ 33 సంవత్సరాలు వెనక్కు వెళ్లి స్కూల్‌కు వెళ్లాలనిపించిందని తెలిపింది.