సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో వచ్చే ఏప్రిల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, తాజాగా జరిపిన ఒక సర్వే రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని, జేడీఎస్ కింగ్‌మేకర్‌గా మారే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది. సీహెచ్‌ఎస్ అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వే రాష్ట్రంలో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందంది. కాంగ్రెస్, బీజేపీ తమ వ్యూహాలకు మరింత పదును పెడితే తప్ప మ్యాజిక్ నంబర్ (112 సీట్లు)ను అందుకోవడం కష్టమని తేల్చింది.
మొత్తం 224 సీట్లలో కాంగ్రెస్ 77–81 సీట్లు, బీజేపీ 73–76, జేడీఎస్ 64–66 సీట్లను సొంతం చేసుకుంటాయంది. ఈ సర్వే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రతి నియోజకవర్గంలో 2 వేల మంది నుంచి సమాచారాన్ని సేకరించి సర్వే జరిపినట్లు సీహెచ్‌ఎస్ తెలిపింది. ఈ సర్వేను కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. తనకు దీంతో సంబంధమే లేదని, సీహెచ్‌ఎస్‌తో పాటు గుర్తు తెలియని వ్యక్తులపై సైబర్‌క్రైం సెల్‌లో ఫిర్యాదు చేసినట్లు పరమేశ్వర్ తెలిపారు. నిజానికి తమ పార్టీకి మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయని జేడీఎస్ చెప్పగా, బీజేపీ కూడా ఈ సర్వేను కొట్టిపారేసింది.
Comments
Please login to add a commentAdd a comment