
సాక్షి, బెంగళూరు: స్మార్ట్‌ఫోన్ గేమ్ ‘పబ్‌జీ’కి బానిసైన ఓ ఇంటర్ విద్యార్థి ఏకంగా పరీక్షల్లో దాని గురించి రాసి ఫెయిల్ అయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలోని గదగ్ జిల్లాలో జరిగింది. గతేడాది టెన్త్ పరీక్షల్లో 73 శాతం మార్కులతో పాసైన ఓ విద్యార్థి గదగ్‌లో ఓ కళాశాలలో ఇంటర్‌లో చేరాడు. స్మార్ట్‌ఫోన్‌లో గంటలతరబడి ‘పబ్‌జీ’ గేమ్ ఆడటంతో అతనికి చదువుపై ఆసక్తి సన్నగిల్లింది.
కళాశాల నుంచి వచ్చాక స్మార్ట్‌ఫోన్‌లో పబ్‌జీ ఆడుతూ గడిపేసేవాడు. ఏం చేస్తున్నావని తల్లిదండ్రులు అడిగితే.. ‘స్నేహితుల దగ్గర సబ్జెక్టుల గురించి చాట్ చేస్తున్నా’ అని జవాబిచ్చేవాడు. చివరికి పరీక్షలు మరో 15 రోజులు ఉన్నాయనగా, పబ్‌జీ ఆడటం ఆపేశాడు. దీంతో చదువుపై ఏకాగ్రత కుదరలేదు. తీరా పరీక్ష హాల్‌లోకి వెళ్లాక.. ఇన్విజిలేటర్లు ఎకనామిక్స్ ప్రశ్నపత్రాన్ని అందించారు. అయితే ఈ ప్రశ్నలకు జవాబులు తెలియకపోవడంతో పబ్‌జీ గేమ్ ఎలా ఆడాలి? ఎలా ఆడితే గెలుస్తాం? అని సవివరంగా వ్యాసాలు రాశాడు. దీంతో ఇటీవల వెలువడ్డ పరీక్షా ఫలితాల్లో అతను ఫెయిల్ అయ్యాడు.