బెంగళూరు: కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రంలోకి రాకపోకలను నిషేధించినట్టు వచ్చిన వార్తలపై కర్ణాటక వివరణ ఇచ్చింది. ఇందులో పూర్తిగా వాస్తవం లేదని గురువారం సాయంత్రం తెలిపింది. ఐదు రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై నిషేధం విధించలేదని స్పష్టం చేసింది. కోవిడ్-19 వ్యాప్తి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వచ్చే విమానాల సంఖ్యను తగ్గించాలని మాత్రమే పౌర విమానయాన మంత్రిత్వ శాఖను అభ్యర్థించినట్టు వెల్లడించింది. తమ రాష్ట్రంలో క్వారెంటైన్ కేంద్రాలు తక్కువగా ఉన్నాయని, ఒకేసారి ఎక్కువ సంఖ్యలో విమాన ప్రయాణికులు వస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు కర్ణాటక మంత్రి జే మధుస్వామి తెలిపారు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన వచ్చే వారికి తగిన నిర్బంధ సౌకర్యాలు ఉండేలా ఆంక్షలు విధించామని మంత్రి చెప్పారు. (ఆ 5 రాష్ట్రాల విమానాలు, రైళ్ల రాకపై నిషేధం!)
కేంద్ర వైద్యారోగ్య శాఖ గణాంకాల ప్రకారం మహారాష్ట్రలో అత్యధికంగా 56,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడు(18545), ఢిల్లీ(15,257), గుజరాత్(15,195), రాజస్థాన్ (7703), మధ్యప్రదేశ్(7261) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment