హనీట్రాప్‌: ఎమ్మెల్యేలు, మాజీల రహస్య వీడియోలు | In Karnataka Gang Which Honeytrapped Politicians Businessmen Nabbed | Sakshi
Sakshi News home page

హనీట్రాప్‌లో 10 మందికిపైగా ఎమ్మెల్యేలు, మాజీలు

Published Sun, Dec 1 2019 7:40 AM | Last Updated on Sun, Dec 1 2019 8:47 AM

In Karnataka Gang Which Honeytrapped Politicians Businessmen Nabbed - Sakshi

ఎమ్మెల్యేలు, బడా నాయకులతో పరిచయాలు పెంచుకుని రహస్య వీడియోలు తీసి బెదిరిస్తున్న ఘరానా హనీ ట్రాప్‌ ముఠా చరిత్రను తవ్వుతున్న కొద్దీ సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం సీసీబీ పోలీసుల అదుపులో ఉన్న ముఠా కీలక సభ్యుల సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు తదితరాల్లో నాయకుల శృంగార వీడియోలు అనేకం బయటపడినట్లు సమాచారం. కొందరు అధికారులు కూడా వలపు ముఠాకు చిక్కడం గమనార్హం.  

బనశంకరి: రాష్ట్రంలో పదిమందికి పైగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హనీ ట్రాప్‌లో చిక్కుకున్న కేసు రోజురోజుకు  మలుపు తిరుగుతోంది. గత ఆగస్టు నుంచి జరుగుతున్న హనీట్రాప్‌ దందాలో సీరియల్‌ నటి బృందానికి మాజీమంత్రులు, శాసనసభ్యుల రాజకీయ ప్రత్యర్థులకు లక్షలాది రూపాయలు అందించి సహకారం అందించినట్లు సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసుల విచారణలో వెలుగుచూసింది. హనీట్రాప్‌ వెలుగులోకి వచ్చిన అనంతరం పలువురు ప్రజాప్రతినిదులు, ప్రముఖులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కేసు లేకుండా పరిష్కరించుకోవడానికి పోలీస్‌శాఖను ఆశ్రయిస్తున్నారు.  

ట్రాప్‌ చేసేవారిలా  
కీలక నిందితుడు రాఘవేంద్ర, అతని ప్రియురాలు తదితరుల నుంచి సీసీబీ పోలీసులు స్వాదీనం చేసుకున్న ఎల్రక్టానిక్స్‌ పరికరాల్లో పదిమందికి పైగా ప్రజాప్రతినిధులు, మాజీమంత్రుల వీడియోలు లభ్యమయ్యాయి. ఇంకా అనేకమంది హనీట్రాప్‌ ఇరుక్కుని డబ్బులు ముట్టజెప్పినట్లు సమాచారం. హనీట్రాప్‌లో ఎమ్మెల్యేలు, అధికారులను బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన మహిళలు రాత్రి 10 గంటల అనంతరం మొబైల్‌ఫోన్‌కు ఫోన్‌ చేసి అర్ధరాత్రి వరకు సంభాషించడం, ఎమ్మెల్యేలు మద్యం మత్తులో ఉండటాన్ని ధ్రువీకరించుకుని మహిళలు రంగంలోకి దిగేవారు. హనీట్రాప్‌ వలలో పడిన ఎమ్మెల్యేలు, యువతులను ఎమ్మెల్యేలు తరచుగా పిలిపించుకునేవారు. ఈ నీచకృత్యాలను పెట్టుబడిగా పెట్టుకున్న వంచకముఠా వీడియోలు తీసి భారీనగదును ఇవ్వాలని నాయకులను ఒత్తిడి చేసేవారు. రాఘవేంద్ర వద్ద ఏడుకు పైగా మొబైల్స్, 15 సిమ్‌కార్డులను స్వాదీనం చేసుకుని వాటిని విశ్లేషిస్తున్నారు.
 
పరారీలో ముఠా సభ్యులు  
రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన హనీట్రాప్‌ ముఠా తమ బృందంలోని ప్రముఖులు అరెస్ట్‌ కావడంతో కొందరు పరారీలో ఉన్నారు. వీరి అరెస్ట్‌చేయడానికి ప్రత్యేక పోలీస్‌బృందం తీవ్రంగా గాలిస్తున్నట్లు సీసీబీ పోలీస్‌ వర్గాలు తెలిపాయి. నిందితులు వీడియో రికార్డింగ్, మొబైల్‌ కాల్స్‌ వివరాలు, సంబాషణలను నాశనం చేశారు. వాటి డిజిటల్‌ సాక్ష్యాల కోసం విచారణ అధికారులు ప్రయత్నిస్తున్నారు.  గదగ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే హనీట్రాప్‌ ముఠాలో చిక్కుకోగా రహస్యంగా చిత్రీకరించడానికి రూ.10 లక్షలు ఇవ్వాలని సీరియల్‌ నటి ఆ ఎమ్మెల్యే రాజకీయ ప్రత్యర్థిని అడిగారు. చివరకు రూ.1 లక్ష చెల్లించారు.
 
ఏదో వంకతో పరిచయం పెంచుకుని 
నియోజకవర్గంలో గ్రామీణ అభివృద్ధికి సంబంధించి క్యాంప్‌ నిర్వహించాలని, వారం రోజుల పాటు ఉండటానికి వ్యవస్థ కల్పించాలని అని గదగ్‌ జిల్లా ఎమ్మెల్యే వద్ద హనీట్రాప్‌ ముఠా సభ్యులు విన్నవించారు. ప్రారంభంలో మహిళ పట్ల అసక్తి చూపని ఎమ్మెల్యే అనంతరం మహిళ ట్రాప్‌లో పడ్డారు. ఎమ్మెల్యే రాసలీలను సీరియల్‌ నటి రహస్యంగా చిత్రీకరించి తన అనుచరులకు అందజేశారు. ఆ సీడీని ఎమ్మెల్యేకు చూపించి రూ.50 కోట్లకు డిమాండ్‌ పెట్టారు. అంత డబ్బు తన వద్దలేదనడంతో కనీసం రూ.10 కోట్లు ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలిసింది. ఉడుపి జిల్లా,  ఉత్తర కన్నడ జిల్లా ఎమ్మెల్యేల వీడియోలు కూడా బయటపడ్డాయి. రహస్య కెమెరా కలిగిన హ్యాండ్‌బ్యాగ్‌ల సాయంతో రికార్డింగ్‌ చేసేవారని తెలిసింది.
 
సమాచారం ఇవ్వండి: పోలీసులు  
హనీట్రాప్‌ వలలో పడిన వ్యక్తులు ఎవరైనా తమకు సమాచారం అందించి విచారణకు సహకరించాలని పోలీస్‌శాఖ కోరింది. ఫిర్యాదుదారుల సమాచారం రహస్యంగా ఉంచి విచారణ చేపడతామని చెబుతున్నారు. హనీట్రాప్‌ కేసులో చిక్కుకుని కంగారుపడిన అనేకమంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం కోర్టును ఆశ్రయించారు. వీడీయోలు, సమాచారం ప్రసారం కాకుండా అడ్డుకోవాలని కొందరు కోర్టులో పిల్‌ వేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement