లోకాయుక్తను నిర్వీర్యం చేయడానికే అవినీతి నిరోధక శాఖ
ఏసీబీ ఏర్పాటుపై మండిపడ్డ విపక్షాలు
దీటుగా సమాధానం ఇచ్చిన అధికార పక్షం
లోకాయుక్తలో ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకేనని విమర్శ
‘ఏసీబీ’ ఏర్పాటుపై ప్రభుత్వానికే స్పష్టత లేదంటూ మండిపాటు
సభ నేటికి వాయిదా
బెంగళూరు: లోకాయుక్త అధికారాలకు కత్తెర వేయడంతో పాటు లోకాయుక్తను నిర్వీర్యం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ (యాంటీ కరెప్షన్ బ్యూరో) ని ఏర్పాటు చేసిందంటూ విపక్షాలు శాసనసభలో ప్రభుత్వంపై మండిపడ్డాయి. మరోవైపు తామేమీ లోకాయుక్తను బలహీన పరచడం లేదని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఏసీబీని ఏర్పాటు చేస్తున్నామని అధికార పక్షం సైతం ధీటుగా సమాధానమిచ్చింది. దీంతో శాసనసభలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇక ఈ అంశంపై ప్రభుత్వం ఇచ్చిన సమాధానానికి తృప్తి పడని విపక్షాలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి తమ నిరసనను తెలియజేశాయి. దీంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప శాసనసభను మంగళవారానికి వాయిదా వేశారు.
ఇక సోమవారం అసెంబ్లీలో జరిగిన కార్యకలాపాలను పరిశీలిస్తే... ఏసీబీ ఏర్పాటుపై మొదటగా ప్రతిపక్షనేత జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం ఏర్పాటు చేసింది ‘అవినీతి నిరోధక దళం’ కాదని, ‘అవినీతి రక్షణ దళం’ అని విమర్శించారు. లోకాయుక్తలో సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదైందని, ఈ కేసు నుంచి బయటపడేందుకే ‘ఏసీబీ’ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. ప్రభుత్వం చెప్పినట్లుగా నడుచుకునే ‘ఏసీబీ’ ఏర్పాటు వల్ల తాను సులభంగా కేసు నుంచి బయటపడవచ్చునని సీఎం సిద్ధరామయ్య భావిస్తున్నారని అన్నారు. ఇదే సందర్భంలో లోకాయుక్తను బలహీన పరిచే ఒక ఎత్తుగడే ఈ ఏసీబీ ఏర్పాటని విమర్శించారు. ఇక ఏసీబీ ఏర్పాటుపై ప్రభుత్వానికే సరైన స్పష్టత లేదని పేర్కొన్నారు. రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1984లో రాష్ట్రంలో లోకాయుక్త చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు.
అప్పటి నుంచి దేశానికే మాదిరిగా (మోడల్‌గా) కర్ణాటకలో లోకాయుక్త చట్టాన్ని బలపరుచుకుంటూ రావాల్సి ఉందని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజు రోజుకు లోకాయుక్తను నిర్వీర్యం చేసేలా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. ఈ అంశంపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర స్పందిస్తూ... ‘లోకాయుక్తను నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కేవలం మరింత పటిష్టంగా అవినీతిపరుల ఆట కట్టించేందుకే ఏసీబీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది’ అని తెలిపారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని విపక్షాలు మంగళవారం సైతం తమ నిరసనను కొనసాగించనున్నట్లు సమాచారం.
మండలిలోనూఅదే వేడి...
మైసూరులో జరిగిన బీజేపీ కార్యకర్త రాజు హత్య ఉదంతం సోమవారం శాసన మండలిని కుదిపేసింది. అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో మండలి దద్దరిల్లింది. కొద్ది రోజుల ముందు మైసూరులో రాజు దుండగుల చేతిలో దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయమై మండలిలో చర్చకు అవకాశం కల్పించాలని విపక్ష నాయకుడు కే.ఎస్ ఈశ్వరప్ప సభాపతి డీ.హెచ్ శంకరమూర్తిని కోరారు. ఈ సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కే.ఎస్ ఈశ్వరప్పపై విమర్శలు కురిపిస్తూ రాజు ఉదంతంపై చర్చ అవసరం లేదన్నారు. దీంతో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ‘ఈ సమయంలో కలుగ జేసుకున్న శంకరమూర్తి మొదటి విషయాన్ని సభకు తెలియజేయండి అటుపై చర్చకు అవకాశం ఉందో లేదో నేను నిర్ణయిస్తా.’ అని పేర్కొన్నారు. దీంతో కే.ఎస్ ఈశ్వర్ప తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... సంఘటన జరిగి దాదాపు పది రోజులు కావస్తున్న ప్రభుత్వం ఇంత వరకూ ఘటనకు కారణమైన వారిని బంధించలేదని విమర్శించారు.
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించకపోతే కర్ణాటకలో తాలిబన్ సంస్కృతి పుట్టుకు వస్తుందని కే.ఎస్ ఈశ్వరప్ప ఆందోళన వ్యక్తం చేశారు. మేము ఏ ఒక్కరి మరణాన్నో ప్రస్తావిస్తూ ఈ విషయంపై రాజకీయం చేయడం లేదన్నారు. అయితే రాష్ట్రంలో ఇటీవల దుండగుల చేతిలో హిందువులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయని పేర్కొన్నారు. మంగళూరులో ప్రశాంత్ పూజారి, మైసూరులో రాజు, మడికేరిలో పుట్టప్ప, శివమొగ్గలో విశ్వనాథ్‌లు హత్యలు ఇందుకు నిదర్శనమని కే.ఎస్ ఈశ్వరప్ప వివరించారు. ‘శివమొగ్గలో పీపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సమావేశంలో పాకిస్తాన్ జిందాబాద్ అన్న వారిపై ఇంత వరకూ చర్యలు చేపట్టలేదు.
అంతే కాకుండా ఆ సంస్థను నిషేధించే విషయంపై కూడా ప్రభుత్వం ఇంతవరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సమయంలో కలుగ జేసుకున్న అధికార పార్టీ ఎమ్మెల్సీ ఉగ్రప్ప ‘అసలు ఈ విషయాలేవి చర్చకు రానేరావు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ గురుజీ ఢిల్లీలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఎదురుగానే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ వ్యాఖ్యలు చేసినా ఎందుకు చర్యలు చేపట్టలేదు.’ అని పేర్కొన్నారు. దీంతో కే.ఎస్ ఈశ్వరప్ప తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీలాంటి న్యాయ కోవిదులను ముఖ్యమంత్రి సిద్దరామయ్య తనతో పాటు ఉంచుకోవడం వల్లే ఆయన పదవి పోగొట్టుకుంటున్నారు. దీంతో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎవరు ఏమి మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి పరిషత్‌లో ఏర్పడింది. ఈ సమయంలో మండలి అధ్యక్షుడు డీ.హెచ్ శంకరమూర్తి కలుగజేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.