సాక్షి, బెంగళూరు: దాదాపు 30 గంటల ఉత్కంఠకు గవర్నర్ వజుభాయ్ వాలా తెరదించారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకే పచ్చజెండా ఊపారు. బీజేఎల్పీ నేత బీఎస్ యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు ఆహ్వానించారు. గురువారం(రేపు) ఉదయం 9:30 గంటలకు రాజ్‌భవన్ ప్రాంగణంలోనే యడ్డీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా తదితర ముఖ్యులు హాజరవుతారని సమాచారం.
బలం నిరూపించుకున్నాకే మంత్రివర్గం: గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న యడ్యూరప్ప.. 10రోజుల్లోగా అంటే మే27లోగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ సూచించారు. ఆ తర్వాతే మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని స్పష్టం చేశారు. గవర్నర్ నిర్ణయంతో బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి.
224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో 222 స్థానాలకు ఎన్నికలు జరుగగా.. బీజేపీ 104 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్(79), జేడీఎస్(38) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బీఎస్పీ(1), ఇండిపెండెంట్లు(2) సీట్లను గెలుచుకున్నారు. సాధారణ మెజారిటీ(112)కి బీజేపీకి 8 అడుగుల దూరంలో నిలిచిపోవడంతో.. జేడీఎస్-కాంగ్రెస్‌లు జతకట్టి, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామంటూ ముందుకొచ్చాయి. ఇరు పక్షాలతో మాట్లాడిన గవర్నర్ చివరికి బీజేపీకే అవకాశాన్ని కల్పిస్తూ, యడ్యూరప్పను సీఎంగా ప్రమాణం చేయాలంటూ ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment