ఆమె రాత్రిపూట అక్కడెందుకు ఉండటం?
కర్ణాటక రాజధాని బెంగళూరు నడిబొడ్డున టెన్నిస్ క్లబ్ వద్ద జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై ఆ రాష్ట్ర హోం మంత్రి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేశారు. ''ఇది చాలా దురదృష్టకరం. తుముకూరుకు చెందిన ఓ మహిళ రాత్రి 9.30 గంటల సమయంలో టెన్నిస్ క్లబ్ వద్ద ఉంది. ఆమె టెన్నిస్ నేర్చుకోవాలని అక్కడికి వెళ్లిందన్నారు. కానీ, అసలు ఆ సమయంలో ఆమె అక్కడ ఎందుకు వేచి ఉందన్నదే అసలు ప్రశ్న. మేం అన్ని విషయాల మీద దర్యాప్తు చేస్తున్నాం'' అని హోం మంత్రి పరమేశ్వర వ్యాఖ్యానించారు. బెంగళూరు కబ్బన్ పార్కు వద్ద ఇద్దరు సెక్యూరిటీ గార్డులు 34 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేశారు.
హోం మంత్రి వ్యాఖ్యలపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మండిపడ్డారు. పరమేశ్వర వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆయన ఇలాంటి ప్రకటనలు చేయడం ఇదేమీ మొదటిసారి కాదని, దీనివల్ల ప్రజల్లోకి సరైన సందేశం వెళ్లదని ఆమె చెప్పారు. ఆయనకు తన పనిమీద ఆసక్తి లేకపోతే వెంటనే దిగిపోవాలని అన్నారు.
గత నెలలో 22 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగినిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అప్పటి హోం మంత్రి కేజే జార్జి కూడా దానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇద్దరే చేస్తే అది గ్యాంగ్ రేప్ ఎందుకు అవుతుందని, కనీసం ముగ్గరు నలుగురు చేస్తే కదా.. అనాల్సింది అంటూ వ్యాఖ్యానించారు. కొన్నాళ్ల తర్వాతే ఆయన స్థానంలో పీసీసీ చీఫ్ పరమేశ్వరను నియమించారు.