బెంగళూరు/న్యూఢిల్లీ: తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేసే క్రమంలో కర్ణాటక అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. తమ రాష్ట్ర సాగునీటి అవసరాలకు నీటి విడుదలపై తగిన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వానికి అన్ని అధికారాలు కట్టబెడుతూ తీర్మానం చేశారు. మంగళవారం మధ్యాహ్నంలోగా తమిళనాడుకు నీటి విడుదలపై సమాచారమివ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశం నేపథ్యంలో తీర్మానం తెచ్చారు. 4 కావేరి రిజర్వాయర్ల నుంచి తాగునీటికే నీటిని విడుదల చేయాలన్న గత తీర్మానంలో మార్పులు చేస్తూ... సాగునీటి అసవరాలకూ నీరివ్వొచ్చని తాజా తీర్మానంలో పేర్కొన్నారు.
తమిళనాడుకు నీటి విడుదలపై సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని పాటిస్తామంటూ పరోక్ష సంకేతాలిచ్చిన సీఎం సిద్ధరామయ్య... తాగునీటి అవసరాలతో పాటు, పంటల్ని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. కర్ణాటక ఎప్పుడూ కోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించలేదని పేర్కొన్నారు. కావేరీ పరివాహకంలో రైతులు నీటి విడుదల చేయాలని కోరుతున్నారని, నీటిని విడుదల చేస్తే కొంత సహజంగా తమిళనాడుకు వెళ్తుందన్నారు.
బోర్డు ఏర్పాటుపై ఆదేశించలేరు: కేంద్రం
ఈ వివాదంపై కేంద్రం తొలిసారి స్పందించింది. కావేరి నీటి నిర్వహణ బోర్డును(సీడబ్ల్యూఎంబీ) ఏర్పాటు చేయాలని తమను ఆదేశించకూడదని సుప్రీంకోర్టుకు తెలిపింది. కావేరి పరివాహకంలో క్షేత్ర స్థాయి నిజ నిర్ధారణ కోసం సాంకేతిక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తామంది. వివాదం చట్టసభల పరిధిలో ఉందని, సీడబ్యూఎంబీ ఏర్పాటు ఆదేశాల్ని సమీక్షించడం, వెనక్కి తీసుకోవడమో చేయాలని కోరింది.
సాగునీటికీ కావేరి జలాలు
Published Tue, Oct 4 2016 2:51 AM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM
Advertisement
Advertisement