ఒక ఐడియా వారి జీవితాలనే మార్చేసింది | Karnataka’s Siddis don’t see elephants as their enemy anymore | Sakshi
Sakshi News home page

ఒక ఐడియా వారి జీవితాలనే మార్చేసింది

Published Wed, Oct 12 2016 6:22 PM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM

ఒక ఐడియా వారి జీవితాలనే మార్చేసింది

ఒక ఐడియా వారి జీవితాలనే మార్చేసింది

న్యూఢిల్లీ: ఒక ఐడియా వారి జీవితాలనే మార్చేసింది. మొన్నటి వరకు పరమ శత్రువులుగా భావించిన ఏనుగులను వారిప్పుడు పరమ మిత్రులుగా భావిస్తున్నారు. ఏనుగు బొమ్మలతో తయారు చేసిన కళాకృతులు వారి జీవితాల్లో కొత్త కాంతులు నింపితున్నాయి. అక్కడి మనుషుల ప్రాణాలతోపాటు వారి వ్యవసాయ పంటలను విధ్వంసం చేస్తూ వచ్చిన గజరాజులు ఇప్పుడు వారికి, వారి పంటలకు దూరంగా మసలుతున్నాయి. ‘వైల్డ్‌లైఫ్ రీసెర్చ్ అండ్ కన్జర్వేటివ్ సొసైటీ’ ఒక ఐడియాతో కర్ణాటకలోని సిద్దూ కమ్యూనిటీ జీవితాల్లో పెద్ద మార్పు తీసుకొచ్చింది.

సిద్దూ తెగకు చెందిన ఈ గిరిజనులు వివిధ ఆఫ్రికా దేశాల నుంచి వచ్చి భారత్‌లో స్థిరపడినవాళ్లు. దేశవ్యాప్తంగా 55 వేల మంది ఉండగా, కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. వారంతా ఎల్లాపూర్ వైల్డ్ ఫారెస్ట్‌కు సమీపంలోని గడ్గెరా లాంటి గ్రామాల్లో నివసిస్తున్నారు. వారిది మొదటి నుంచి వ్యవసాయమే ప్రధాన వృత్తి. వారి వ్యవసాయ భూములన్నీ అటవి ప్రాంతానికి సమీపంలో ఉండడంతో తరచు ఏనుగుల మంద వారి పంటలపై దాడిచేసి విధ్వంసం సృష్టించేవి. మనుషులను కూడా పొట్టనపెట్టుకునేవి.

దేశవ్యాప్తంగా 28 వేల నుంచి 31వేల మధ్య ఏనుగులు ఉండగా, వాటిలో ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకు కర్ణాటక అటవీ ప్రాంతాల్లో ఉన్నాయనేది ఓ అంచనా. ఏనుగుల దాడుల్లో దేశవ్యాప్తంగా ఏటా 250 నుంచి 350 మంది చనిపోతుండగా, ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే ఏటా 25 నుంచి 30 మంది మరణిస్తున్నారు. మనుషుల ప్రతికార దాడుల్లో ఏటా దాదాపు 100 ఏనుగులు మరణిస్తున్నాయి. ఏనుగుల విధ్వంసం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా కోట్లాది రూపాయల నష్ట పరిహారం చెల్లించాల్సి వస్తోంది. ఒక్క 2013-14 ఆర్థిక సంవత్సరానికే 9,93,80,000 రూపాయలను ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది.


ఏనుగులను చంపాల్సిన అవసరం లేకుండా, వాటి చేతుల్లో చావకుండా ఎన్నో సులభమైన మార్గాలున్నాయంటూ వన్యప్రాణి సంరక్షణ అధికారులు సిద్దూ తెగ గిరిజనులకు సూచించారు. పొలాల సరిహద్దుల్లో ఎండు మిరప గింజలను తీసుకొచ్చి అక్కడున్న గడ్డిలో కలపాలని, ఏనుగులు వచ్చే మార్గంలో ఆవు పిడకలను పేర్చాలని, వృధా చమురు, తిని పడేసే మాంసం బొక్కలను అప్పుడప్పుడు పంట పొలాల వద్ద వేసి మండించాలని, అప్పుడప్పుడు టపాసులను కూడా పేల్చవచ్చని అధికారులు ప్రజలకు సూచించారు. ఇలా తరచుగా చేస్తే ఏనుగులు మళ్లీ ఆ దిక్కుగా రావని వారు చెప్పారు. ఆవు పిడకల వాసన, ఎముకలు కాలే వాసన, ఎండు మిర్చి గింజల ఘాటను ఏనుగులు తట్టుకోలేవని వారు ఈ సూచనలు చేశారు. ఏనుగులను తరతరాలుగా పరమ శత్రువులగా భావిస్తున్న ఆ గిరిజనులు ఈ సూచనలు పాటించేందుకు నిరాకరించారు. ఏనుగులు తమకు కనిపిస్తే చాలు, ప్రాణం పోయినా వాటిని చంపేస్తామని వ్యవసాయ రైతులు (పురుషులు) భీష్మించారు.

ముందుగా వారి ఆలోచనల్లో పెద్ద మార్పు తీసుకొస్తే తప్ప వారి వైఖరిలో మార్పు రాదని భావించిన అధికారులు ‘ఐరావత్’ పేరిట ఓ పథకాన్ని చేపట్టారు. అందుకు సిద్దూ తెగకు చెందిన మహిళలను ఎంపిక చేసుకున్నారు. వారికి రుమాలు నుంచి తువ్వాల వరకు దుస్తులపై ఏనుగు బొమ్మలను అల్లడం. వాటిపై ఏనుగుల ఆకారంలో పూసలను గుజ్జడం, వివిధ రకాల వస్తువులతో ఏనుగు బొమ్మలతో కీచైన్లు తయారు చేయడం, కారు అద్దాల ముందు వేలాడేసుకొనే ఏనుగు బొమ్మలను తయారు చేయడం లాంటి చేతి కళలను నేర్పించారు. వాటి తయారీకి కావాల్సిన ముడిసరులను కూడా సరఫరా చేశారు.  ఆతర్వాత తయారు చేసిన వస్తువులను మార్కెట్ కూడా చూపించారు.

దాంతో ఆ గిరిజన మహిళలకు ఊహించిన దానికన్నా గిట్టుబాటు ఎక్కువగానే ఉంటోంది. ఇప్పుడు ఆ మహిళలంతా స్వయం పోషక బృందాలుగా ఏర్పాటి ముడి సరకులు కొనుగోలు నుంచి మార్కెటింగ్ వరకు అన్నీ వారే చూసుకుంటున్నారు. తమకు ఇంత ఆదాయాన్ని తీసుకొస్తున్న ఏనుగుపట్ల వారికి ఆరాధ్యభావం ఏర్పడింది. వారి భర్తల వైఖరి కూడా మారిపోయింది. అధికారులు సూచించిన ప్రకారం వారు ఏనుగులు పొలాల వద్దకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అప్పటి నుంచి ఏనుగులు తమ పొలాల వద్దకు రావడం లేదని, మరోపక్క తమకు కొత్త ఉపాధి అవకాశాలు దొరికాయని సిద్దూ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పచ్చని పంటలను ఏనుగుల మందా నాశనం చేసిందని అప్పుడప్పుడు మనం తిట్టుకుంటాం. కానీ అవి జనావాస ప్రాంతాల్లోకి రావడానికి మానవుడే కారణం. డ్యామ్‌ల పేరిట, జల విద్యుత్ కేంద్రాల పేరిట, గనుల తవ్వకాలు, క్వారీలతో వన్య ప్రాంతాలను మానవుడు కబ్జా చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement