సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన్న ఊహాగానాలు ఒకరోజు వినిపిం చాయి. మరుసటి రోజు కాంగ్రెస్ అండతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన్న వార్తలు వచ్చాయి. ఆప్, కాంగ్రెస్ ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన్న వార్తలు మరోరోజు వ్యాపించాయి. ఇవేవీ కావు.. ఎన్నికలు జరగడం తథ్యమని మరోరోజు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎమ్మెల్యే బేరసారాల గురించి ఆరోపణ లు, ప్రత్యారోపణలు రోజూ వినబడుతూనే ఉన్నాయి.
ఢిల్లీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఆదివారం రాత్రి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలవడంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముందనే ఊహాగానాలు మరోమారు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో 24 మంది ఆప్ ఎమ్మెల్యేలతోపాటు అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నజీబ్ జంగ్‌తో సోమవారం భేటీ అయ్యారు. దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు దాదాపు శూన్యంగానే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను విలేకరుల సమావేశంలో హాజరుపర్చి తన బలం చెక్కు చెదరలేదని చూపింది. అయితే ఎల్జీతో ఆప్ సభ్యుల సమావేశానికి రోహిణి ఎమ్మెల్యే రాజేష్ గార్గ్ గెర్హాజరయ్యారు. ఎమ్మెల్యేలు ఎన్నికలు కోరుకోవడం లేదని, ప్రభుత్వ ఏర్పాటుకు ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని గార్గ్ ఇదివరకే అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన గైర్హాజరు చర్చనీయాంశంగా మారింది.
మరోమారు ఎన్నికలకు వెళ్లడానికి పలువురు ఎమ్మెల్యేలు సుముఖంగా లేకపోవడంతో ఊహాగానాలకు ఊపిరి లభిస్తోంది. ఎన్నికల్లో పోటీచేస్తే మరోమారు గెలుస్తామా? అన్న భయంతో ఎమ్మెల్యేలు ప్రజల ముందుకు ఓట్ల కోసం వెళ్లడానికి వెనుకాడుతున్నారు. ఆప్, బీజేపీ అగ్రనాయకత్వం ఎన్నికలనే కోరుతుండడంతో ప్రభుత్వం ఏర్పాటుకు దారులు తెరచుకోవడం లేదు. అన్ని పక్షాలూ తమ వైఖరిని స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత ఎల్జీ చేతిలోనే ఉంది. ఆయన ఆహ్వానిస్తే ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తామని బీజేపీ ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన బీజేపీని కోరుతారా లేక అసెంబ్లీని రద్దు చేస్తారా లేదా మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధిస్తారా అన్న విషయం తేలాల్సి ఉంది. అందరితో చర్చించిన తరువాత రాష్ట్రపతికి నివేదిక సమర్పిస్తానని మాత్రమే లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు. ఢిల్లీలో త్వరలో ఎన్నికలు జరగకపోవచ్చన్న అనుమానాలకు ఆయన మాటలు తావిస్తున్నాయి.
ఎల్జీ కోర్టులో బంతి
Published Mon, Jul 21 2014 10:24 PM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM
Advertisement