కేజ్రీవాల్ కస్టడీ 6 వరకు పొడిగింపు
బెయిల్ బాండ్ ఇవ్వడానికి ఆప్ నేత ససేమిరా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ రిమాండ్‌ను ఢిల్లీ కోర్టు జూన్ 6వ తేదీ వరకు పొడిగించింది. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ పెట్టిన పరువు నష్టం కేసులో బెయిల్ బాండ్ సమర్పించకపోవడంతో ఈనెల 21న కేజ్రీవాల్‌కు రెండు రోజుల కస్టడీ విధించడం తెలిసిందే. దీంతో అదేరోజు ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. కస్టడీ గడువు ముగియడంతో శుక్రవారం కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరిచారు. బెయిల్ బాండ్ సమర్పించకూడదన్న తన పాత వైఖరికే కట్టుబడి ఉండటంతో.. కోర్టు ఆయన్ను మందలించింది. ఈ అంశంపై వివేకంతో వ్యవహరించాలంది. ‘‘మే 21న నేను జారీచేసిన ఉత్తర్వులు పునఃసమీక్షించబోను. మీరు కావాలనుకుంటే నా ఉత్తర్వులను సవాల్ చేసుకోవచ్చు.
పార్టీ ఇతర నేతలు బెయిల్ బాండు సమర్పిస్తున్నప్పుడు కేజ్రీవాల్ ఎందుకు ఆ పనిచేయడంలేదు’’ అని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గోమతి మనోకా ప్రశ్నించారు. దేశంలో న్యాయపరమైన అంశాల్లో చాలామందికి అవగాహన ఉండటంలేదని, చివరకు విద్యావంతులకు కూడా ఏది బెయిలో ఏది బెయిల్ బాండో తెలియడంలేదన్నారు. అంతకుముందు కేజ్రీవాల్ వాదిస్తూ.. ‘‘ఎంతోమంది రాజకీయ నేతలుు నాపై ఇలాంటి కేసులు పెట్టారు. దీంతో కోర్టులకు అండర్‌టేకింగ్ ఇచ్చిన తర్వాత విడుదలయ్యేవాడిని’’ అని చెప్పారు. అయితే, బెయిల్ కోసం బాండు సమర్పించడం న్యాయపరమైన ప్రక్రియ అని న్యాయమూర్తి పేర్కొంటూ కేజ్రీవాల్‌కు విధించిన కస్టడీని పొడిగించారు.