
తిరువనంతపురం: గల్ఫ్ దేశాల నుంచి రాష్ట్రానికి తిరిగి రావాలని ఆశిస్తున్న ప్రవాసులకు కరోనా రహిత ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరి చేస్తూ.. కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రవాసుల పట్ల ప్రభుత్వానికి దయ లేదంటూ కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ విమర్శించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజను ‘కోవిడ్ రాణి’ అంటూ ఎగతాళి చేశారు. అంతేకాక ఆమె ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు. ఆమెకు రికార్డులు, పురస్కారాల మీద ఉన్న ప్రేమ జనాల ఆరోగ్యం గురించి లేదన్నారు. కేరళ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన ఒక రోజు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆరోగ్య మంత్రి కేకే శైలజ గతంలో ‘నిపా రాజకుమారి’ టైటిల్ పొందారు.. ఇప్పుడు ‘కోవిడ్ రాణి’ బిరుదు కోసం ప్రయత్నిస్తున్నారు’ అని మండిపడ్డారు.
గత మూడు నెలల్లో కరోనా కారణంగా గల్ఫ్‌లో 200 మందికి పైగా ప్రవాసులు మరణించారు. ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని రామచంద్రన్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘విదేశాల్లో ఉన్న మా ప్రజలు తిరిగి రావాలని కోరుకుంటున్నారు. కానీ ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య గురించి భయపడుతోంది. కేరళ అభివృద్ధి కోసం పాటుపడిన పేద ప్రవాసులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేవలం వారి గురించి మొసలి కన్నీరు కారుస్తుంది’ అన్నారు. అయితే కేరళ కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దాంతో ఆయన దిద్దుబాటు చర్యలకు దిగారు. తాను స్త్రీలను అవమానించలేదని.. కేవలం ప్రభుత్వాన్ని, విధులు సరిగ్గా నిర్వహించిన మంత్రిని మాత్రమే విమర్శించానని తెలిపారు.