
తిరువనంతపురం: కరోనా వైరస్(కోవిడ్-19) నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను సడలిస్తూ తీసుకున్న నిర్ణయంపై కేరళ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బార్బర్ షాపులు తెరవడం, రెస్టారెంట్ల నిర్వహణ, బుక్ షాపులు తెరవడం, సరి- బేసి విధానంలో ప్రైవేటు వాహనాలకు అనుమతినిస్తూ జారీ చేసిన నిబంధనలను ఉపసంహరించుకుంది. కరోనా ఉధృతి పెరుగుతున్న తరుణంలో అత్యవసరం కాని సేవలకు అనుమతినిస్తూ కేరళ సహా ఇతర రాష్ట్రాలు నిబంధనలు సడలించడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా మహమ్మారి మరింత విజృంభిస్తుందని హెచ్చరించింది. (లాక్‌డౌన్: కేరళ సర్కారుపై కేంద్రం సీరియస్!)
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కేంద్రం జారీ చేసిన గైడ్‌లైన్స్‌ను యథావిధిగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా కేరళ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ క్రమంలో తొలుత నిబంధనల సడలింపుపై కేంద్ర మార్గదర్శకాలనే అమలు చేస్తున్నామన్న కేరళ ప్రభుత్వం... తాజాగా తన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. సమాచార సమన్వయ లోపం వల్లే ఇలా జరిగిందని.. కేంద్ర నిబంధలను విరుద్ధంగా లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. కరోనా తీవ్రత ఆధారంగా రాష్ట్రంలోని జిల్లాలను రెడ్, ఆరెంజ్ ఏ, ఆరెంజ్ బీ, గ్రీన్ జోన్లుగా విభజిస్తూ అక్కడ పాటించాల్సిన నిబంధనలపై కేరళ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. (లాక్‌డౌన్: కేరళ కీలక ఆదేశాలు.. సడలింపులు ఇవే)
ఇందులో భాగంగా కాసర్‌గడ్, కన్నూరు, మలప్పురం, కోజికోడ్ జిల్లాలను రెడ్ జోన్‌లో చేర్చి అక్కడ లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తామన్న విజయన్ సర్కారు... పతనంతిట్ట, ఎర్నాకులం, కొల్లాం జిల్లాలను ఆరెంజ్ ఏ జోన్‌లో చేర్చి పాక్షిక నిబంధనలు అమలు చేస్తామని వెల్లడించింది. అదే విధంగా ఆరెంజ్ బీ జోన్‌లోని అలప్పుజ, తిరువనంతపురం, పాలక్కాడ్, వయనాడ్, త్రిసూర్ జిల్లాలు... కొట్టాయం, ఇడుక్కి జిల్లాలను గ్రీన్ జోన్ కింద పరిగణిస్తూ కొన్ని రంగాలకు మినహాయింపునిస్తున్నట్లు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఇక కేరళలో ఆదివారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 401కి చేరింది. వీరిలో 270 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా... 129 మంది చికిత్స పొందుతున్నారు. 55,590 మంది అబ్జర్వేషన్‌లో ఉన్నారు. (లాక్‌డౌన్ : పాటించాల్సిన కొత్త రూల్స్)
Comments
Please login to add a commentAdd a comment