మోదీ బేషరతు క్షమాపణ చెప్పాలి
‘సోమాలియా’ వ్యాఖ్యలపై కేరళ సీఎం చాందీ డిమాండ్
కొచ్చి/తిరువనంతపురం: కేరళను సోమాలియాతో పోలుస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. మోదీ వ్యాఖ్యలపై న్యాయపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని కేరళ ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ గురువారం వెల్లడించారు. మోదీపై విరుచుకుపడిన చాందీ.. కేరళీయుల ఆత్మగౌరవాన్ని మోదీ దెబ్బతీశారని, అందుకు వెంటనే బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై మోదీ నిశ్శబ్దంగా ఉండటం తగదని, ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇటీవల కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ కేరళలో శిశు మరణాల రేటు సోమాలియాకంటే దారుణంగా ఉందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే మోదీ వ్యాఖ్యలపై రాజకీయ వివాదం చెలరేగింది. అలాగే సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. కొన్ని మీడియా రిపోర్టుల ఆధారంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని, అవి పూర్తిగా తప్పని చాందీ చెప్పారు. ఇలాంటి ప్రకటనలు చేసేముందు అధికారిక నివేదికలను ప్రధానిగా ఉన్న మోదీ సరిచూసుకోవాల్సిందని సూచించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్ కంటే శిశు మరణాల రేటు, పోషకాహార లోపం తదితర అంశాల్లో కేరళ చాలా మెరుగ్గా ఉందని, మానవ అభివృద్ధి సూచీలో కేరళ తొలి స్థానంలో ఉంటే.. గుజరాత్ 11వ స్థానంలో ఉందని వివరించారు.