ఖైదీల పరస్పర బదిలీ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ :
భారత్, సోమాలియా దేశాల మధ్య శిక్ష పడ్డ ఖైదీల పరస్పర మార్పిడి ఒప్పందానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఖైదీల పరస్పర బదిలీ ఒప్పందానికి అంగీకారం తెలపడంతో పాటూ ధైపాక్షికంగా ఆమోదంపొందడానికి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం కింద భారత్, సోమాలియాల్లో శిక్షఅనుభవిస్తున్న ఖైదీలు, మిగిలిన శిక్షా కాలాన్ని తమ సొంత దేశాల్లోని జైళ్లలో గడిపే అవకాశం లభించనుంది.
ఇప్పటికే యూకే, మారిషస్, బల్గేరియా, ఫ్రాన్స్, ఈజిప్ట్, శ్రీలంక, కాంబోడియా, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, ఇరాన్, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇజ్రాయిల్, బోస్నియా- హెర్జిగోవినా, యూఏఈ, ఇటలీ, టర్కీ, మాల్దీవులు, థాయిలాండ్, రష్యా, కువైట్, వియత్నం, ఆస్ట్రేలియా, హాంగ్‌కాంగ్, ఖతార్, మంగోలియా, కజకిస్థాన్, బెహ్రెన్, ఈస్టోనియా దేశాలతో భారత్ ఖైదీల పరస్పర బదిలీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.