కార్త్యాయని అమ్మ(ఫొటో కర్టెసీ: ఇండియా టుడే)
తిరువనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభణ నేపథ్యంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన వారికి కేరళ బామ్మ కార్త్యాయినీ అమ్మ ధన్యవాదాలు తెలిపారు. దేశ విదేశాల నుంచి వచ్చిన వారు ఇతరుల కోసం ఇంట్లోనే ఉండిపోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఈ మేరకు ఆమె... ‘‘ప్రియమైన పిల్లల్లారా... పనులు చక్కబెట్టుకునేందుకు సుదూర దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. అయితే ఇప్పుడు మీరు ఇంట్లోనే కూర్చుని ఉన్నారు. ఎవరినీ కలవడం లేదు. నాలాంటి వృద్ధులు, పిల్లలను కాపాడేందుకు మీరు ప్రయత్నిస్తున్నారు. మీ ప్రేమ చూసి నాకు కన్నీళ్లు వస్తున్నాయి. మనమంతా కలిసి కరోనా వైరస్‌ను ఎదుర్కొందాం. ధన్యవాదాలు నా పిల్లల్లారా’’ అని భావోద్వేగ లేఖ రాశారు.(5 కరోనా కేసులు.. అన్ని సర్వీసులు బంద్!)
అదే విధంగా కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలని... ముఖం, చెవులు, కళ్లను తాకకుండా ఉంటే మేలని ప్రజలకు సూచించారు. కాగా కార్త్యాయని అమ్మ 96 ఏళ్ల వయస్సులో రాష్ట్ర బోర్డు ఎగ్జామ్ పాసైన వ్యక్తిగా 2018లో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇక మహమ్మారి కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా 10 వేల మందికి పైగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. వీరిలో ఎక్కువగా వృద్ధులే ఉండటం గమనార్హం. ఇక భారత్‌లోనూ కరోనా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో 223 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలంటూ సెలబ్రిటీలు సూచిస్తున్నారు.(కరోనా: ఆ యువకుడికి 9 లక్షల జరిమానా!)
Comments
Please login to add a commentAdd a comment