సుప్రీం కోర్టు సమర్థన
న్యూఢిల్లీ: ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే బార్ లెసైన్సులు మంజూరు చేస్తూ కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం విధానం రాజ్యాంగబద్ధమేనని సుప్రీం కోర్టు సమర్థించింది. దేశ మద్యం వినియోగంలో 14 శాతం వాటా చిన్న రాష్ట్రమైన కేరళదేనని, బహిరంగ మద్యపానంపై నిషేధం విధించాలన్న రాష్ట్ర నిర్ణయం చట్టబద్ధం, సహేతుకమేనని జస్టిస్ విక్రమ్‌జిత్, జస్టిస్ శివకీర్తిల బెంచ్ మంగళవారం తీర్పు వెలువరించింది. మద్యం అమ్మకాల్లో ఫైవ్ స్టార్ హోటళ్ల వాటా కేవలం 0.08 శాతమే మాత్రమేనని కోర్టు గుర్తు చేసింది. వందశాతం అక్షరాస్యత ఉన్న కేరళలో మద్యం వినియోగం భారీగా ఉందని పేర్కొంది.
మద్యాన్ని స్వేచ్ఛగా అమ్మడం వల్ల సామాజిక దుష్పరిణామాలు కలుగుతాయని, ఈ విధానాన్ని సవాలు చేసిన ఆ రాష్ట్ర బార్ యజమానుల అప్పీళ్లను స్వీకరించలేమని పేర్కొంది. ఈ విధానం వల్ల ఏడు వందల బార్లు మూతపడతాయని, వేలాది మంది ఉపాధి కోల్పోతారని బార్ల యజమానులు వాదించారు. కోర్టు స్పందిస్తూ.. వారి పునరావాసం కోసం మద్యంపై సెస్సును వాడాలని, హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. మద్యం విధానాన్ని బార్ యజమానులు కేరళ హైకోర్టులో సవాల్ చేయగా ప్రభుత్వ అనుకూల తీర్పు వచ్చింది. వారు సుప్రీం గడప తొక్కారు.
కొత్త విధానం ప్రకారం.. ఫైవ్‌స్టార్ కాని హోటళ్లు, బార్లలో మద్యాన్ని అమ్మకూడదు. 2023 నాటికి రాష్ట్రంలో మద్యాన్ని సంపూర్ణంగా నిషేధించేందుకు దీన్ని తీసుకొచ్చారు. కోర్టును తీర్పుపై కేరళ సీఎం హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ విధానం ఆలోచనాత్మకమైన, సాహోపేతమైన నిర్ణయం. వ్యాపారులకు వ్యతిరేకం కాదు, సామాజిక దురాచారానికి వ్యతిరేకం’ అని తిరువనంతపురంలో విలేకర్లతో అన్నారు.
కేరళ మద్యం విధానం చట్టబద్ధమే
Published Wed, Dec 30 2015 2:14 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement